Published 09 Dec 2023
దేశంలో నగదు రహిత లావాదేవీగా గుర్తింపు పొంది అప్రతిహతంగా దూసుకుపోతున్న UPI(Unified Payment Interface) పేమెంట్స్ ను మరింత విస్తృతం చేసే ఆలోచనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని కొత్త విధానాలు అమలు చేయబోతున్నది. కేవలం సాధారణ లావాదేవీలకే కాకుండా అత్యవసర పరిస్థితుల్లోనూ భారీ మొత్తంగా చెల్లింపులు జరిగేలా నూతన విధానాన్ని తీసుకువస్తున్నది. దేశంలో ఆసుపత్రులు(Hospitals), విద్యాసంస్థల(Educational Institutions)కు UPI చెల్లింపుల పరిమితిని లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. RBI ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం సందర్భంగా ఈ సిస్టమ్ ను తీసుకువస్తున్నట్లు RBI గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. అత్యవసర సమయాల్లో ఎక్కువ మొత్తంలో చెల్లింపులు జరిపేందుకు గాను యూపీఐ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నామన్నారు.
వాస్తవానికి ఆసుపత్రులు, విద్యాలయాల్లో బిల్లులు లక్షల్లో ఉంటే వాటిని చెల్లించేందుకు నేరుగా నగదునే ఇవ్వాల్సి వస్తున్నది. హాస్పిటల్స్ లో క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ కు అవకాశం లేకపోవడంతో పెద్దమొత్తంలో నగదు డ్రా చేయాలన్నా ఇబ్బందులున్నాయి. అటు ATMల్లోనూ పెద్దగా నిల్వలు ఉంచకపోవడంతో పెద్ద ఎమౌంట్ కోసం నాలుగైదు మిషన్ల వద్దకు తిరగాల్సి వస్తోంది. అయినా అక్కడ దొరుకుతుందన్న గ్యారెంటీ లేని పరిస్థితుల్లో తాజాగా RBI తీసుకున్న నిర్ణయం ఎంతోమంది మేలు చేయనుంది. తద్వారా ఆన్ లైన్ ట్రాన్జాక్షన్ లోనూ పారదర్శకత ఏర్పడి ప్రతి చెల్లింపూ ప్రభుత్వ లెక్కల్లో చేరిపోనుంది.