
Published 24 Dec 2023
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పథకం ‘మహాలక్ష్మీ. RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం(Free Journey) కల్పిస్తూ అందుబాటులోకి తీసుకువచ్చిన ‘జీరో టికెట్’ విధానంపై ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు ప్రయాణిస్తున్నారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారని లెక్కలు చెబుతున్నాయి. దీనిపై అధికారికంగా కూడా ఆ సంస్థ ప్రకటన చేసింది.
‘జీరో టికెట్’ వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలేనని తెలిపింది. అయితే ఆక్యుపెన్సీ రేషియో(OR) నిజంగానే పెరిగిందా లేక కండక్టర్లు ఇష్టమొచ్చినట్లు టికెట్లు కొట్టడం వల్ల లెక్కలు తప్పుతున్నాయా అన్న కోణంలో అనుమానాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఇంతటి స్థాయిలో OR ఎలా పెరిగిందన్న దానిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న అధికారులు.. టికెట్ల జారీపై నిఘా పెడుతున్నారు.’జీరో టికెట్ల’ జారీపై చెకింగ్ లు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16న పదిహేడు డిపోలు, 17న 20 డిపోలు, 18 నాడైతే 40 డిపోల్లో 100 శాతానికి పైగా OR నమోదైందని DMలు రిపోర్టులు పంపించారు. ఈ నెల 9 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్ కు ఈ స్థాయిలో ఆదరణ ఉంటోందా అన్న సంశయాలు అధికారుల్లో ఉన్నాయి. నిజంగానే మహిళలు బస్సుల్ని వాడుకుంటున్నారా లేక కండక్టర్లే టికెట్లను ఇష్టారీతిన జారీ చేస్తున్నారా అన్న కోణంలో ఇంటర్నల్ గా విచారణ సాగిస్తున్నారు. అయితే దీనిపై ఇక నుంచి చెకింగ్స్ చేపట్టాలని కూడా ఆదేశించారు.