Published 18 Jan 2024
MLA కోటాలో నిర్వహించే రెండు MLC స్థానాలకు జరిగే ఎన్నికలు లాంఛనంగా మారనున్నాయి. ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ నర్సింగరావు నామినేషన్లు దాఖలు చేశారు. ఖాళీ అయిన స్థానాలకు గాను ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ కాగా అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ రోజుతో ఈ ఘట్టం ముగియనుండగా.. ఈ నెల 29న సాయంత్రం వరకు ఎన్నికలు, అదే రోజు సాయంత్రం తర్వాత కౌంటింగ్ చేపడతారు.
మూడున్నరేళ్లకు పైగా…
శాసనసభ(Assembly)లో అత్యధిక మెజారిటీ కలిగిన కాంగ్రెస్ కే ఈ రెండు సీట్లు దక్కనుండటంతో ఆ పార్టీ డిసైడ్ చేసిన PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఎన్నిక ఇక లాంఛనమే. ఖాళీ అయిన MLC పదవులకు 2027 నవంబరు 30 వరకు గడువు ఉండగా, ఈ రెండింటికి వేర్వేరుగా ఉప ఎన్నికలు(By Elections) నిర్వహించాలని EC నిర్ణయించింది. తొలుత మహేశ్ కుమార్ గౌడ్ ప్లేస్ ను అద్దంకి దయాకర్ కు ఫిక్స్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నా చివరి నిమిషంలో పేరు మార్చింది.
విద్యార్థి దశ నుంచే…
స్టూడెంట్ దశ నుంచే కాంగ్రెస్ లో పనిచేస్తున్న ఈ ఇద్దరిలో మహేశ్ బీకాం చదివారు. 2014, 2023 శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. MBBS చదివిన బల్మూరి వెంకట్ వెలమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఈయన NSUIలో పనిచేస్తూ స్టేట్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగి, గత ప్రభుత్వంలో వివిధ సమస్యలపై పోరాటం చేశారు. ప్రతి దశలోనూ తానున్నానంటూ పార్టీని ముందుకు నడిపిన వెంకట్ కు MLC కేటాయించడంతో ఆయనకు మంచి గుర్తింపు లభించినట్లయింది. ఇచ్చిన మాట ప్రకారం మహేశ్, వెంకట్ కు సీట్లు కట్టబెట్టి హైకమాండ్ తన మాట నిలుపుకొంది.