Published 22 Jan 2024
శ్రీరాముడంటే ఆజానుబాహుడు.. అరవింద నేత్ర దళాయతాక్షుడు.. కోదండాన్ని ధరించినవాడు.. ఇలా ఆయన రూపాల్ని ఊహించుకుంటాం. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ అనగానే.. విల్లు చేతబట్టి, పట్టాభిషిక్తుడైన మహారాజే కనిపిస్తాడని అందరూ అనుకున్నారు. ఆ తీరులోనే విగ్రహ రూపకల్పన జరుగుతుందని భావించారు. బాలరాముడి విగ్రహం విషయం వెలుగులోకి వచ్చే దాకా అందరూ ఆజానుబాహుడైన శ్రీరామచంద్రుడి రూపాన్నే ఊహించుకున్నారు.
బాలరాముడి వెనుక కథ…
శ్రీరామచంద్రమూర్తి విళంబి నామ సంవత్సర ఛైత్ర శుద్ధ నవమి నాడు జన్మించాడు. ఆయన పుట్టినపుడు 11 రోజుల జాతక నియమా(దోషా)న్ని పక్కనపెట్టి మరీ బాలరాముణ్ని ముద్దాడాడట దశరథ మహారాజు. చిన్నారి రాముడిని ఎత్తుకోవడానికి యత్నించిన సమయంలో పెద్దగా ఏడుపు మొదలుపెట్టాడట. దీంతో చేసేదిలేక దశరథుడు ఆ బాలరాముణ్ని కౌసల్య చేతిలో పెట్టాడు. ఇది జరగ్గానే చిలిపి రాముడు ఏడుపు మానేయడంతో, పుట్టినపుడే లీలను ప్రదర్శించాడని భావించారు. ఆ లీలలు ఆనోటా ఈనోటా ప్రచారం కావడంతో అయోధ్య ప్రజలు అప్పట్నుంచే ఆయన్ను బాల రాముడిగా భావిస్తూ ‘రామ్ లల్లా విరాజ్మాన్’గా కీర్తిస్తున్నారు. ఎంతటి ధీరోదాత్తుడు, మహా చక్రవర్తిగా రూపాంతరం చెందినా తమకు ఎప్పటికీ అతడు బాలరాముడే అన్న చందంగా అయోధ్యావాసులు తమ మనసుల్లో స్థానం కల్పించారు. ఈ కారణంతోనే తాజాగా అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతున్నారు.
సప్త మోక్ష క్షేత్రాలుగా…
సరయూ నదీ తీరంలో సూర్య భగవానుడి పుత్రుడైన వైవస్వత మనువు నెలకొల్పిన నగరం అయోధ్య. ఇది మోక్ష నగరమే కాదు ధర్మ నగరం కూడా. వర్ణించడానికి ఏమీ లేక కేవలం సంపదను చెప్పడానికి లంకా నగరాన్ని పోల్చితే… ధార్మిక, తపస్య, దివ్యమైన స్థితి గల నగరంగా ఓటమి లేని ప్రాంతంగా అయోధ్యకు పేరుంది. బాబర్ నుంచి భూమిని స్వాధీనం చేసుకుని రామాలయాన్ని పునర్నిర్మించాలని ఎందరో రాజులు ప్రాణత్యాగాలు చేశారు. 1949 డిసెంబరు 22 నాడు అభిరామ్ దాస్ అనే రామ భక్తుడు.. ప్రహరీ దాటి మందిరంలోకి ప్రవేశించి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. రాముడు స్వయంభువని నిరూపించడంతో అప్పట్నుంచి అక్కడ ఆరాధన ప్రారంభమైంది. అయోధ్య, మధుర, మాయా(హరిద్వారం), కాశీ, కాంచీ, అవంతిక(ఉజ్జయిని), పురీ ద్వారావతి(ద్వారకా నగరం) క్షేత్రాలు సప్త మోక్ష క్షేత్రాలుగా విరాజిల్లాయి. ఏటా సీతారామ కళ్యాణం నిర్వహించడానికి ప్రధాన కారణం… రాగద్వేషాల నుంచి అరిషడ్వర్గాల నుంచి మనుషుల్ని బయటపడేసి లోక కళ్యాణం జరిపేందుకేనట.
అందరూ ఓడినా అయోధ్య గెలిచింది…
తెల్లవారేసరికి రాముణ్ని పట్టాభిషిక్తుణ్ని చేయాలని దశరథుడు తలచినా అది నెరవేరక ఓడిపోయాడట. తన తనయుడు భరతుణ్ని చక్రవర్తిని చేయాలని భావించిన కైకేయి.. ఆ విషయంలో సఫలీకృతం కాలేక ఆమె సైతం ఓడిపోయింది. ఏం చేసైనా సరే రామచంద్రమూర్తిని అయోధ్యకు తిరిగి తీసుకువస్తానని, సింహాసనం మీద కూర్చోబెడతానన్న ప్రతిజ్ఞతో చిత్రకూటానికి వెళ్లాడు భరతుడు. భారీ గణంతో రాముడి వద్దకు వెళ్లినా ఆ తేజోమయ సంపన్నుడు తిరిగిరాకపోవడంతో భరతుడు రిక్తహస్తాలతోనే వెనుదిరిగి ఒకరకంగా ఓటమి చెందినట్లే భావించాడు. ఇలా రఘువంశంలో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఓడిపోయినా అయోధ్యలో గెలిచింది చివరకు ధర్మమే. దశరథుడు మరణించినపుడు రాముడు అరణ్యంలో ఉంటే, భరతుడు నందిగ్రామంలో పాదుకలకు పట్టం కట్టి రాజ్యపాలన చేపట్టాడు. ఆ సమయంలో అయోధ్య ఖాళీగా ఉన్నా ఎవరూ ఆ నగరంపై దండెత్తలేదు. దైవారాధన, దైవాచరణ.. ఈ రెండే అయోధ్యకు మోక్షంగా, అయోధ్య జయానికి, శాంతికి, కాంతికి, క్రాంతికి సంకేతంగా నిలిచాయన్నది ప్రతీతి.
మానవత్వాన్ని అవహేళన చేసి…
కఠోర తపస్సు తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాక రావణుడు.. యక్ష, కిన్నెర, కింపురుషాదులతో చావు లేకుండా వరమివ్వమంటూ ఇతర జీవుల్ని గడ్డిపోచతో సమానమంటూ మానవత్వాన్ని అవహేళన చేశాడు. ఇలా విష్ణుతత్త్వాన్నే అవహేళన చేయడంతో ఆ అహంకారాన్ని అణిచేందుకు శ్రీమన్నారాయణుడు మానవుడిగా రామావతారంలో జన్మించాడు. మానవ జీవితం వంటి విశిష్ట అవతారం లేదనిపించేలా ధర్మానికి బాటలు వేసుకునేలా పాలన సాగించి ఆదర్శమూర్తిగా మన్ననలందుకున్నాడు. 28 చతుర్యుగాలు గడిచినా ఇప్పటికీ మనం రామచంద్రమూర్తి కళ్యాణం జరుపుతున్నాం. మానవత్వంతో ధర్మాన్ని పాటించి జీవనం సాగిస్తే మనిషి మహానుభావుడు, ఆరాధ్యుడవుతాడని రాముడు నిదర్శనమిచ్చాడు. దైవమైనా ధర్మం తప్పితే దిక్కులేనివాడవుతాడని లంకాధిపతి నిరూపించాడు.