Published 24 Dec 2023
రాష్ట్ర కేడర్ లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు తెలుగును పూర్తిస్థాయిలో నేర్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. స్థానిక భాషపై పట్టు ఉంటే సమస్యల్ని లోతుల్లోనుంచి అర్థం చేసుకోవచ్చని గుర్తు చేశారు. కలెక్టర్లు, SPలు, అదనపు కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన CM.. ప్రజలతో కలిసిపోవాలంటే స్థానిక భాష తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే వారిపైనే రివ్యూ చేయాల్సి ఉంటుందని, ప్రజా సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలే తప్ప అధికార హోదా చూపెట్టొద్దంటూ ఉన్నతాధికారులకు సూచించారు.
రంగుల గోడలు, అద్దాల మేడలు కాదు…
సెక్రటేరియట్ లో మూడు గంటల పాటు సాగిన సమావేశంలో వివిధ అంశాలపై సూచనలు ఇస్తూనే ప్రజా సమస్యల పరిష్కారంపై ఎలా శ్రద్ధ పెట్టాలో వివరించారు. రంగుల గోడలు, అద్దాల మేడలే అభివృద్ధి కాదని.. పేదోడి కష్టాలను తొలగించినపుడే అసలైన డెవలప్మెంట్ అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు అన్నింటినీ సహిస్తారు కానీ స్వేచ్ఛపై దెబ్బకొడితే ఓర్చుకోరు అని రేవంత్ తెలియజేశారు.