Published 24 Dec 2023
రాష్ట్రంలో మీరెలాంటి చర్యలు తీసుకుంటారో తెలియదు.. కానీ అక్రమాలకు పాల్పడే ఒక్కొక్కడి పీచమణచాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలు(Drugs), గంజాయి ప్రతి పల్లెల్లోనూ దొరికే పరిస్థితికి చేరుకుందని, డేంజరస్ లెవెల్లో స్కూళ్లల్లో డ్రగ్స్ కనపడుతున్నాయని గుర్తు చేశారు. ఇందుకోసం మీకు పూర్తి అధికారాలు(Full Powers) ఇస్తున్నామంటూ డ్రగ్స్, భూమాఫియా వంటి వాటిని అరికట్టాలన్నారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణ మారకముందే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారుల మీటింగ్ లో ఆదేశించారు. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడం ఒకటే బాధ్యత కాదు.. ఇలాంటి వాటిపైనా మీరు సీరియస్ గా నిఘా పెట్టాలి అంటూ రేవంత్ సూచించారు.
ఎంత పెద్దోడైనా కఠినంగా ఉండండి..
‘డ్రగ్స్ ను నిషేధించి, నిర్మూలించాల్సిన బాధ్యత పోలీసుల అధికారులదే.. ఎక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు తెలుసో లేదో కానీ నాకు మాత్రం సమాచారం ఉంది.. గంజాయి అనే పదం రాష్ట్రంలో వినపడకుండా ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశిస్తున్నా.. ఉద్యమ నేపథ్యమున్న తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ కు చోటు లేదు.. ఇప్పుడు సైబర్ క్రైమే పెద్ద టాస్క్.. అక్రమాలకు సైబర్ క్రైమ్ ను వాడుకుంటున్నారు.. అలాంటి వారిపై సైబరాబాద్ CP దృష్టిపెట్టాలి.. ఫ్యూచర్ జనరేషన్ ను నాశనం చేస్తున్న హుక్కా, పబ్స్, ఇతర వల్గర్ పార్టీలపై పూర్తిగా కన్నేసి ఒక్కొక్కడి దుమ్ముదులపండి అంటూ సీఎం స్పష్టం చేశారు.