Published 26 Dec 2023
13 పరుగులకే కెప్టెన్ ఔట్… 23 స్కోరుకే 3 వికెట్లు. టాప్ ఆర్డర్ లో ఏ ఒక్కరూ గట్టిగా నిలబడకపోవడంతో భారత జట్టు(Team India) కష్టాల్లో పడింది. పేసర్ కగిసో రబాడ ఐదు వికెట్లతో విజృంభించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో లంచ్ సమయానికి 91/3తో ఉన్న టీమ్.. తర్వాత కాసేపటికే 121/6కు చేరుకుంది. సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్స్ పార్కులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు… భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. యశస్వి జైస్వాల్(17)తో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ(5) ఒక్క ఫోర్ మాత్రమే కొట్టి ఔటయ్యాడు. రబాడ్ వేసిన షార్ట్ డెలివరీని హుక్ చేయబోయి బర్గర్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ అవుటైన వెంటనే టీమిండియాకు వరుసగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. లెగ్ సైడ్ వెళ్తున్న బంతి అనూహ్యంగా గ్లవ్స్ కు తాకడంతో గిల్ క్యాచ్ గా వెనుదిరిగాడు. తొలుత అంపైర్ ఔట్ ఇవ్వకపోగా కెప్టెన్ బవుమా రివ్యూ కోరడంతో గ్లవ్స్ ను బాల్ తాకినట్లు రీప్లేలో తేలింది.
తేరుకుంటున్నట్లు కనిపించినా…
24కే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును కోహ్లి(38), శ్రేయస్(31) ఆదుకోవడానికి ట్రై చేశారు. కానీ ఆ ఇద్దరితోపాటు రవిచంద్రన్ అశ్విన్(8)ను కూడా రబాడ బుట్టలో వేసుకున్నాడు. నాలుగు కీలక వికెట్లను ఖాతాలో వేసుకున్న రబాడ.. భారత ఇన్నింగ్స్ ను దెబ్బతీశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్ నిలకడగా ఆడుతున్న సమయంలో శార్దూల్(24)ను సైతం రబాడ ఔట్ చేశాడు.