Published 28 Dec 2023
తెలంగాణ రాష్ట్రం(Telangana State) ఇప్పుడే కొత్తగా ఏర్పడిందని భావిస్తూ నూతన బడ్జెట్ ను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇష్టమొచ్చినట్లు, అడ్డగోలు ఖర్చులు లేకుండా ఈ బడ్జెట్ ఉండాలని ఆర్థిక శాఖ సమావేశంలో స్పష్టం చేశారు. ఎవరో కొందరు మాత్రమే లక్ష్యంగా కాకుండా తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకునేలా నిర్ణయాలు ఉండాలని గుర్తు చేశారు. అప్పులు దాచి ఆదాయ, వ్యయాలను భూతద్దంలో చూపాల్సిన అవసరం లేదని, ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు తెలియాల్సిన అవసరముందన్నారు.
క్రెడిట్ ఎవరిదైనా సరే…
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపై భేషజాలకు పోకుండా క్రెడిట్ ఎవరిదైనా సరే అంతిమంగా జనాలకు లాభం చేకూరడమే టార్గెట్ గా ఆలోచనా విధానం ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ఒక్క వాహనం కూడా కొత్తది కొనకుండా నెల నెలా ఖర్చులు ఎలా ఉన్నాయి.. మనం అమలు చేసే స్కీమ్ లకు ఎంతవుతుంది.. ఉద్యోగుల జీతాలకు చెల్లించేది ఎంత అన్న దానిపై స్పష్టత ఉండాలని రేవంత్ క్లారిటీ ఇచ్చారు.