Published 28 Dec 2023
తమిళ కథానాయకుడు విజయ్ కాంత్ కన్నుమూశారు. రాజకీయాల్లోనూ అడుగుపెట్టి DMDK(దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం) పార్టీని స్థాపించిన ఆయన.. 71 ఏళ్ల వయసులో మృతిచెందారు. 1952 ఆగస్టు 25న జన్మించిన ఆయన.. అనారోగ్యంతో వైద్యం తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయారు. ‘ఇనిక్కుం ఇలామై’తో సినీ రంగ ప్రవేశం చేసిన విజయ్ కాంత్.. 100 సినిమాల్లో నటించిన ఖ్యాతిని గడించారు. విరుదాచలం, రిషివాండియం నియోజకవర్గాల నుంచి గెలిచి రెండు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ‘విప్లవ కథానాయకుడి(పురట్చి కళింగర్)గా పిలుచుకునే విజయ్.. పోలీస్ పాత్రల్లోనే 20 చిత్రాల్లో కనిపించారు.
ఈయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగర్ స్వామి కాగా విజయ్ కాంత్ గా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి(Opposition Leader)గా వ్యవహరించారు. పాలిటిక్స్ లోకి రాకముందు సినిమాల్లో మంచి పేరు సంపాదించుకున్న ఈయన.. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పనిచేశారు. మాతృభాషనే నమ్ముకుని కేవలం తమిళ సినిమాలకే పరిమితమైన అతి కొద్ది మందిలో విజయ్ కాంత్ ఒకరు కాగా.. ఈయన సినిమాలు తెలుగు, హిందీ భాషల్లో డబ్ అయ్యాయి.
చాలా మూవీల్లో అవినీతిపై పోరాటంతో కూడిన రోల్స్ చేసిన ఆయన.. తన రెమ్యునరేషన్ ను కూడా కష్టాల్లో ఉన్న నిర్మాతలకు పంచిన మంచి మనిషిగా ముద్ర పడ్డారు. చివరకు తన పేరు చివరన ‘రాజ్’ అనే ప్రత్యేకతను తొలగించుకుని కేవలం ‘కాంత్’గా స్థిరపడి సాధారణ స్థాయి వ్యక్తిగా నిలిచిపోయారు. ఈ నవంబరు 18న దగ్గు, గొంతునొప్పితో హాస్పిటల్ లో చేరి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్న విజయ్ కాంత్ కు జరిపిన టెస్టుల్లో కొవిడ్ పాజిటివ్ వచ్చింది.