Published 30 Dec 2023
రవాణాశాఖపై రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ డిపార్ట్ మెంట్ లో OD(On Duty)లు రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఒకచోట పనిచేయాల్సిన అధికారిని మరో చోట డిప్యుటేషన్ పై విధులు నిర్వర్తించే విధానానికి స్వస్తి పలికింది. రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టుల్లో ODలపై పనిచేస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్(MVI), AMVI, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల ఆన్ డిప్యుటేషన్ ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 చెక్ పోస్ట్ లు ఉండగా.. వీటిలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు అడిషనల్ గా రెగ్యులర్ ఉద్యోగులు పాగా వేశారు. పోటీలు పడి మరీ పోస్టింగ్ లు తెచ్చుకుని చెక్ పోస్టుల్లో తిష్ఠవేశారని గుర్తించిన ప్రభుత్వం.. ఏకంగా ఓడీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో వారంతా తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆన్ డ్యూటీపైనే విధుల్లో ఉంటున్నట్లు ప్రభుత్వం వద్ద నివేదిక ఉంది. అటు సంవత్సరాలుగా ఇదే విధానంలో ఉంటూ కాలం గడుపుతున్నారన్న రిపోర్ట్ ఆధారంగా ఏకంగా ODలను రద్దు చేసినట్లు అర్థమవుతున్నది. వాస్తవానికి గత పదేళ్ల కాలంలో ఈ డిపార్ట్మెంట్ లో కొందరు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నారన్న భావన ఉంది. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఈ శాఖను ప్రక్షాళన చేయాలని భావించిన విధంగానే తొలి నిర్ణయంగా ఆన్ డ్యూటీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.