
Published 30 Dec 2023
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి(Constituency Development) ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది. వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలోని మండలాలన్నింటిని అభివృద్ధి చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి రేవంత్ రెడ్డి గెలిస్తే ముఖ్యమంత్రి అవడం ఖాయమని, కొడంగల్ నుంచి మరోసారి ఆయన్ను గెలిపించాలంటూ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహించింది. రేవంత్ CM అయితే పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఏర్పడి యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అక్కడి ప్రజలు భావించారు. అనుకున్నట్లుగా BRS అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై ఆయన.. 32,920 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
‘కాడా’ పేరుతో అథారిటీ…
కర్ణాటకతో సరిహద్దు పంచుకుంటున్న కొడంగల్ నియోజకవర్గానికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటైంది. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(KADA) పేరుతో సెగ్మెంట్లో అభివృద్ధి జరగనుంది. ఈ ‘కాడా’కు స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో ఉన్నా ఎక్కువ భాగం వికారాబాద్ జిల్లాలోనే ఉండటంతో అదే జిల్లా కలెక్టర్ కు అభివృద్ధి బాధ్యతలు కట్టబెట్టారు. కలెక్టర్ ఆధ్వర్యంలోనే మొత్తం అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.
చేపట్టబోయే కార్యక్రమాలివి…
- నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష
- సీసీ రోడ్లు, మురుగునీటి కాల్వలు, నీటి సరఫరా, విద్యుత్తు వ్యవస్థల అభివృద్ధి
- ఉత్పత్తి, పరిశ్రమల రంగాల్లో ఉపాధి అవకాశాల కల్పన
- విద్య, వైద్య రంగాల్లో స్వావలంబన దిశగా అడుగులు
- సహజ వనరులైన మట్టి(భూ) పరీక్షలు, భూగర్భ జలాల పెంపునకు చర్యలు
- అనువుగా గల వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి