
Published 30 Dec 2023
తెలంగాణలో పుట్టి బ్రిటన్(United Kingdom)లో స్థిరపడి అక్కడి ప్రజలకు విశేష సేవలందించిన వైద్యుడి(Doctor)కి ఆ దేశానికి చెందిన అత్యున్నత పురస్కారం దక్కింది. అసాధారణ వైద్య సేవలందిస్తూ లండన్ లో సెటిలైన చంద్రమోహన్ కన్నెగంటికి బ్రిటన్ అత్యున్నత పురస్కారమైన ‘కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్(CBE)’ అవార్డును అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపికైన చంద్రమోహన్ ను బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అభినందించారు. గత 80 సంవత్సరాల్లో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి తెలుగువాడిగా ఆయన చరిత్ర క్రియేట్ చేశారు. వైద్యరంగంలో అందించిన కృషికి గాను 2023 ఏడాదికి ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టి ఆ దేశంలో స్థిరపడి ఈ అవార్డు అందుకున్న ఒకే ఒక వ్యక్తిగా చంద్రమోహన్ కీర్తినందుకున్నారు.

స్టీఫెన్ హాకింగ్ సరసన…
నిజామాబాద్ లో పుట్టి హైదరాబాద్ లో పెరిగిన చంద్రమోహన్.. గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేసుకున్నారు. అనంతరం లండన్ వెళ్లి 27 ఏళ్లుగా జనరల్ ప్రాక్టీషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంగ్లండ్ ప్రజలకు వైద్యుడిగానే కాకుండా పొలిటీషియన్ గా సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈయన పనితీరును గుర్తించిన అక్కడి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించబోతున్నది. డా.చంద్రమోహన్ కన్నెగంటి త్వరలోనే బ్రిటిష్ రాజకుటుంబం చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. గతంలో ఈ పురస్కారాన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా అందుకున్నారు. అలా ఈ రకంగా ఆయన హాకింగ్ సరసన చేరబోతున్నారు.

దక్షిణాసియా నుంచి ‘వన్ అండ్ ఓన్లీ’
నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన దామోదర్ రావు-సరోజిని దంపతుల కుమారుడైన చంద్రమోహన్.. ధర్మారం గ్రామంలో జన్మించారు. నిర్మల్ లో 2వ తరగతి, ఆ తర్వాత హైదరాబాద్ లో ఇంటర్ వరకు చదివారు. బ్రిటన్ అందించే అత్యున్నత పురస్కారాన్ని ఏటా డిసెంబరు 30న ప్రకటించి కొత్త సంవత్సరంలో అందజేస్తారు. ఈసారి ఈ అవార్డును 102 మందికి ప్రకటిస్తే అది అందుకోబోతున్న తెలుగువాడే కాకుండా ఏకైక దక్షిణాసియా వాసిగా చంద్రమోహన్ కన్నెగంటి రికార్డు నెలకొల్పబోతున్నారు. 1938 తర్వాత ‘కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్(CBE)’ అందుకుంటున్న వ్యక్తిగా ఈ డాక్టర్ నిలిచిపోతున్నారు. స్టోక్ ఆన్ ట్రెంట్ నగరంలో రెండు సార్లు కౌన్సిలర్ గా, ఒకసారి మేయర్ గా పనిచేసిన చంద్రమోహన్… వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రధాని రిషి సునాక్ తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి.
