Published 30 Dec 2023
రాష్ట్రంలో మెగా డీఎస్సీకి అడుగులు పడుతున్నాయి. త్వరలోనే డీఎస్సీ(DSC) నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం కమిటీ వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) శాంతికుమారికి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరీక్షల విధానాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్న CM.. ఇప్పటికే ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజైన విషయాన్ని గుర్తు చేశారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీల వరకు వివిధ అంశాలు ఈ సమీక్షలో చర్చకు వచ్చాయి.
బడి లేని పంచాయతీ లేకుండా…
తమ ప్రభుత్వంలో బడి లేని పంచాయతీ ఉండకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పిల్లలు లేరనో, ఉపాధ్యాయుల కొరత ఉందనో పాఠశాలను మూసివేసే దుస్థితి రాకూడదని ఆదేశించారు. టీచర్ల బదిలీలు(Transfers), పదోన్నతుల్లో(Promotions)లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేలా చూడాలన్నారు. ఇందుకోసం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని అధికారులను CM ఆదేశించారు.