Published 01 Jan 2024
ప్రపంచమంతా నూతన సంవత్సర సంబరాల్లో(New Year Celebrations) మునిగిపోతే కొన్ని దేశాలు సునామీ హెచ్చరికలతో గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే సంభవించిన భారీ భూకంపంతో గుండెలు అదురుతుంటే ఇక సునామీ ముప్పు ఎలా ఉంటుందోనన్న భయం వెంటాడుతోంది. తాజా పరిణామాలను బట్టి సునామీ వచ్చే పరిస్థితి ఉందని జపాన్ లో హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఆ దేశంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో నమోదు కాగా… భూకంప కేంద్రం జపాన్ రాజధాని టోక్యోకు 300 కిలోమీటర్ల దూరంలోని నోటో పెనిన్సులా సమీపంలో కేంద్రీకృతమైనట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలందర్నీ అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు.
జపాన్ పశ్చిమ తీరంలో ఏర్పడిన భూకంపం ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇషికవా రాష్ట్రంలో కంటిన్యూగా భూ ప్రకంపనలు వచ్చాయి. వజీమా నగర తీరాన్ని ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకినట్లు సునామీ హెచ్చరికల కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఈ అలలు 5 మీటర్ల కంటే ఎత్తులో ఉండే అవకాశం ఉందంటూ సమీప ప్రాంతాల ప్రజల్ని సురక్షిత చోట్లకు తరలించారు. ఒక్క జపానే కాకుండా రష్యా, ఉత్తరకొరియా, దక్షిణకొరియా ప్రాంతాలనూ భూ ప్రకంపనలు తాకాయి. ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉన్న జపాన్ లో తరచూ భూకంపాలు వస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యధిక అగ్ని పర్వతాలు అక్కడ ఉండటంతో ఇవి ప్రమాదాలకు కారణంగా నిలుస్తుంటాయి.