Published 02 Jan 2024
ఇప్పటికే రెండు మ్యాచ్ లు చేజార్చుకుని.. సిరీస్ కోల్పోయిన దశలో చివరి వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితుల్లో భారత మహిళా బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆస్ట్రేలియా భారీ స్కోరుకు కనీసం పోటీ అయినా ఇవ్వకుండానే చేతులెత్తేశారు. 339 పరుగుల టార్గెట్ కళ్ల ముందున్నా కనీసం అందులో సగం కూడా చేయలేకపోయారంటే ఎంతటి దారుణ పరాభవం ఎదురైందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యర్థి జట్టు 7 వికెట్లకు 338 రన్స్ చేస్తే.. మన జట్టు 32.4 ఓవర్లలోనే 148 పరుగులకు ఆలౌటై 190 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. భారత్ పై వరుసగా మూడు వన్డేల్లో గెలిచి ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది.
ఆసీస్ ఓపెనర్ల హవా..
ఓపెనర్లు భారీ ఇన్నింగ్స్ ఆడటంతో 189 పరుగుల దాకా కంగారూ జట్టు ఒక్క వికెట్ కోల్పోలేదు. ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ వుమెన్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫోబ్ లిచ్ ఫీల్డ్(119; 125 బంతుల్లో 16×4, 1×6), కెప్టెన్ అలీసా హీలీ(82; 85 బంతుల్లో 4×4, 3×6) దడదడలాడించారు. చివరి వరుస బ్యాటర్లు సైతం తలో చేయి వేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. శ్రేయాంక పటేల్ 3, అమన్ జోత్ కౌర్ 2 వికెట్లు తీసుకున్నారు.
నిలవలేక… గెలిచే ఓపిక లేక…
భారత టీమ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కంగారూ బౌలర్ల ధాటికి 53కే 3 వికెట్లు కోల్పోయింది. యాస్తిక భాటియా(6), స్మృతి మంధాన(29), రిచా ఘోష్(19), హర్మన్ ప్రీత్(3), జెమీమా(25), దీప్తి(25), పూజ వస్త్రాకర్(14)… అంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ దారి పట్టారు. కనీసం పోటీ ఇవ్వాలన్న కసి ఏ ఒక్కరిలోనూ కనపడలేదు. జార్జియా వేరమ్ 3, మేగన్ షట్, అలన కింగ్, అన్నాబెల్ తలో రెండు వికెట్ల చొప్పున తీసుకున్నారు. సెంచరీ చేసిన లిచ్ ఫోల్డ్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తోపాటు సిరీస్ మొత్తం రాణించిన ఆమెకే ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఆసీస్ టీమ్ 3-0తో గెలుచుకుంది.