
Published 02 Jan 2024
ఓపెనర్ అర్షిన్ కులకర్ణి ఆల్ రౌండ్ ప్రతిభ చూపడంతో భారత్ జయకేతనం ఎగురవేసింది. ముక్కోణపు సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న అండర్ 19 టీమ్.. సఫారీ జట్టుకు చుక్కలు చూపించింది. జోహన్నెస్ బర్గ్ లో జరిగిన వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ప్రత్యర్థిని 46.1 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూల్చింది. అనంతరం 40.5 ఓవర్లలో 3 వికెట్లకు 244 రన్స్ చేసి ఘన విజయం సొంతం చేసుకుంది. ఆ జట్టు ఓపెనర్లు ప్రిటోరియస్(67) స్టీవ్ స్టాక్(46) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో ఆరాధ్య శుక్లా 4, సౌమీ పాండే 3, అర్షిన్ కులకర్ణి 2 వికెట్లు తీసుకున్నారు.
ఓపెనర్ల ధనాధన్…
241 టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లతోపాటు ముగ్గురు బ్యాటర్లు మంచి పార్ట్నర్ షిప్ లు అందించారు. అర్షిన్(91; 106 బంతుల్లో 12×4, 1×6), ఆదర్శ్ సింగ్(66; 70 బంతుల్లో 10×4), అరవెల్లి అవినాశ్(60; 56 బంతుల్లో 8×4, 1×6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో.. టీమిండియా గెలుపు నల్లేరుపై నడకే అయింది. ఈ ముక్కోణపు సిరీస్ లో భారత్, సౌతాఫ్రికాతోపాటు అఫ్గానిస్థాన్ తలపడుతోంది. ఆడిన రెండింటికి రెండు మ్యాచ్ ల్లో గెలిచి భారత్ 4 పాయింట్లతో ఉంటే.. సొంతగడ్డపై సఫారీ జట్టు రెండింట్లోనూ ఓడింది. ఇక అఫ్గాన్ ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు సాధించింది.