
Published 03 Jan 2024
2… 4… 2… 3… 12… అదేదో అడ్వర్టయిజ్మెంట్లో విద్యార్థుల ర్యాంకులు చదువుతున్నట్లుగా ఉంది ఇది చూస్తే. అచ్చంగా అలాగే ఔటయ్యారు మరి దక్షిణాఫ్రికా బ్యాటర్లు. భారత పేస్ దళం.. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ విధ్వంసం సృష్టించడంతో సఫారీ జట్టు కకావికలమైంది(Scattered). తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయం పాలైన టీమిండియా.. ప్రతీకార దాడిని రెండో టెస్టులో మొదలు పెట్టింది. కేప్ టౌన్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. 46 స్కోరుకే 8 వికెట్లు చేజార్చుకుంది. మిగతా పేసర్లు సైతం విజృంభించడంతో 55 పరుగులకే కుప్పకూలింది.
సిరాజ్ అద్భుతం..
తొలి మూడు ఓవర్లలో 5 పరుగులు చేసిన దక్షిణాఫ్రికాపై నాలుగో ఓవర్ ఫస్ట్ బాల్ నుంచి మొదలైంది సిరాజ్ ఊచకోత. సెకండ్ స్లిప్ లో జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ మార్ క్రమ్(2) ఫస్ట్ వికెట్ గా ఔటయ్యాడు. డీన్ ఎల్గర్(4)ను సైతం సిరాజ్ బుట్టలో వేసుకోగా.. ట్రిస్టన్ స్టబ్స్(3)ను బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇక వరుసగా డేవిడ్ బెడింగ్ హామ్(12), కైల్ వెరీన్(15), మార్కో యాన్సెన్(0)ను సిరాజ్ వెనక్కు పంపాడు. చివర్లో ముకేశ్ కుమార్ కూడా రెండు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా పతనం స్పీడ్ గా సాగింది.
15 పరుగులిచ్చి 6 వికెట్లు…
సిరాజ్ దాడి మామూలుగా సాగలేదు. బంతి వేస్తే చాలు.. వికెట్ అన్నట్లుగా పేస్ తో దడదడలాడించాడు. 9 ఓవర్లు వేసిన అతడు కేవలం 15 పరుగులే ఇచ్చి 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో మరోసారి 5 వికెట్ల హాల్ ను అందుకున్న సిరాజ్ కు.. బుమ్రా, ముకేశ్ అండగా నిలిచారు. ఈ ఇద్దరూ చెరో రెండు వికెట్ల చొప్పున తీసుకోవడంతో సఫారీ జట్టుకు ఇక కోలుకునే అవకాశమే రాలేదు.