మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 04 Jan 2024
పిచ్ లను తమకు అనుకూలంగా తయారు చేసుకుని భారత్ గెలుస్తుంటుంది.. మరీ ఇంతటి అధ్వాన స్పిన్ పిచా… ఇలాగైతే ఎలా ఆడేది.. ఉపఖండ(Subcontinent) మైదానాల్లో ఆడాలంటే భారత్ కు తప్ప ఎవరికీ సాధ్యం కాదు.. ఇదీ మన దేశానికి వచ్చినప్పుడల్లా విదేశీ టీమ్ లు చేసే విమర్శ. మరి ఒక్కరోజులోనే 23 వికెట్లు కూలడం.. ఒకటిన్నర రోజులోనే ఆట ముగియడం చూస్తే మరి అదే జట్లకు ఈ తేడా కనిపించదా..? ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఆడితే ఒకలా.. భారత్ లో ఆడితే మరొకలా మాట్లాడే సంప్రదాయం ఉన్న పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చాడు. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ పిచ్ పై పేస్ బౌలర్ల హవా ఎలా సాగిందో చూశాం. మన బౌలర్లు బాగా రాణించారు కాబట్టే విజయం సాధించాం కానీ.. ఈ మ్యాచ్ లో ఓడిపోయుంటే ఫాస్ట్ పిచ్ లపై భారత ప్లేయర్లకు ఆడరాదన్న అపవాదు మళ్లీ వినిపించి ఉండేది.
ఒకటిన్నర రోజులోనే…
ఐదు రోజులు జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ కేవలం 642 బంతుల్లో(107 ఓవర్లలో)నే ముగిసిందంటే ఇంతకంటే దారుణమైన పిచ్ మరొకటి ఉండదేమో. క్రికెట్ పుట్టిన సమయంలో 122 ఏళ్ల క్రితం మాత్రమే నమోదైన రికార్డును న్యూలాండ్స్ గ్రౌండ్ చెరిపేసిందంటే.. ఎంతటి సీమ్ కోసం తయారు చేశారో తెలుసుకోవచ్చు. కేప్ టౌన్ పిచ్ ను అత్యంత డేంజరస్ గా అభివర్ణించిన రోహిత్.. అయినా దాని వల్ల పెద్దగా భయపడాల్సిందేమీ లేదని అన్నాడు. తొలి రోజు నుంచే బంతి టర్న్ కావడం కేవలం భారత్ లోనే కాదు ప్రపంచమంతటా ఉందని గుర్తు చేశాడు. భారతదేశంలోని మైదానాలపై తరచూ నోరు పారేసుకునే కొందరు.. ఇలాంటి వాటి గురించి ఎందుకు మాట్లాడరో అర్థం కాదన్నాడు. ‘ఇండియాలో బంతి బాగా టర్న్ అయిందంటే చాలు.. అబ్బో ఇదేం పిచ్.. న్యూట్రల్ గా ఉండాలి కదా.. మ్యాచ్ రిఫరీలు ఏం చేస్తున్నారు అంటారు.. మొన్న వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన అహ్మదాబాద్ పిచ్ సైతం రేటింగ్ కు తగిన విధంగా స్టాండర్డ్స్ లేవు అంటూ విమర్శించారు.. కానీ అదే పిచ్ పై ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియన్) సెంచరీ చేశాడు.. దేశాల్ని బట్టి కాదు, పిచ్ లని బట్టి రేటింగ్ ఇవ్వాలి..’ అని రోహిత్ ఘాటుగానే బదులిచ్చాడు.
ఎటాకింగ్ గేమే కరెక్టని…
గురువారం ముగిసిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్ క్రమ్, భారత ఓపెనర్ జైస్వాల్ ఎటాకింగ్ గేమ్ తోనే ఎక్కువ స్ట్రైక్ రేట్ సాధించారు. ఈ పిచ్ పై డిఫెన్స్ ఆడితే లాభం లేదనుకుని ఎటాకింగ్ గేమ్ కే ప్రయారిటీ ఇచ్చారు. టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగిన వెంటనే కేప్ టౌన్ పిచ్ గురించి తెలిసిపోయిందని రోహిత్ తెలిపాడు. ఇది ఎక్కువ సెషన్ల పాటు సాగే మ్యాచ్ కాదని అర్థమైందన్నాడు. అనుకున్నట్లుగానే ఈ మ్యాచ్ కేవలం ఐదు సెషన్లలోనే ముగిసిపోయింది.