Published 06 Jan 2024
భారత యువ జట్టు ఆటతీరుకు తిరుగులేకుండా పోతోంది. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ కంటిన్యూగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. ఆడాలే గానీ అది స్వదేశమా, విదేశీ గడ్డనా అన్న తేడా లేకుండా విజయ పరంపర కొనసాగిస్తున్నది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత కుర్రాళ్లు వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నారు. జోహన్నెస్ బర్గ్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న యువ టీమిండియా.. సౌతాఫ్రికాను 256 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. 4 వికెట్లకు 260 రన్స్ చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
5 వికెట్ల ముషీర్ ఖాన్…
దక్షిణాఫ్రికా టీమ్ లో స్టీవ్ స్టాక్(69) హయ్యెస్ట్ స్కోరర్ కాగా.. డెవాన్ మరాయిస్(32), రిలే నాటన్(32), సిఫో పాట్సనే(31) తలా కొద్దిసేపు నిలబడ్డారు. ముఖ్యంగా ముషీర్ ఖాన్ 5 వికెట్లతో విజృంభించడంతో సౌతాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.
సహరన్ సెంచరీ...
ఆల్ రౌండర్ ముషీర్ ఖాన్ 5 వికెట్లతో ఆటాడుకుంటే భారత బ్యాటింగ్ లో ఉదయ్ సహరన్(112; 153 బంతుల్లో 10×4) సెంచరీ హైలెట్ గా నిలిచింది. ప్రియాన్షు మాలియా(76), ముషీర్ ఖాన్(41) రాణించారు. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమ్ కు సూపర్ సెంచరీతో సహరన్ గెలుపును అందించాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ విజయాలతో 8 పాయింట్లు భారత్ ఖాతాలో ఉండగా.. మూడింటికి ఒకదాంట్లో గెలిచి అఫ్గాన్ 2 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక ఆడిన మూడింట్లోనూ సఫారీ జట్టు ఓడిపోయింది.