
భారత్ క్రికెట్ ఆటగాళ్ల జెర్సీ స్పాన్సర్ షిప్ మారింది. ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్ ఫామ్ అయిన ‘డ్రీమ్ 11’ టీమ్ ఇండియా కొత్త స్పాన్సర్ గా అవతరించింది. ఇక నుంచి ‘డ్రీమ్ 11’ జెర్సీతోనే ఆటగాళ్లు మైదానాల్లో కనిపిస్తారు. ఇప్పటివరకు స్పాన్సర్ గా వ్యవహరించిన బైజూస్ సంస్థ స్థానంలో మూడేళ్ల కాలానికి సంబంధించిన కాంట్రాక్టుకు ‘డ్రీమ్ 11’ ఓకే అయినట్లు BCCI ప్రకటించింది. ఇకపై BCCI అధికారిక స్పాన్సర్ గా ‘డ్రీమ్ 11’ ఉండబోతోంది.
ఈ సంవత్సరం అక్టోబరు, నవంబరులో మనదేశంలో వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. దానికి ముందు టీమ్ ఇండియా ఆసియా కప్ లో పాల్గొనాల్సి ఉంది. 2020 IPL సీజన్ కు టైటిల్ స్పాన్సర్ గా ‘డ్రీమ్ 11’ వ్యవహరించింది. ఇప్పుడు ఏకంగా జాతీయ జట్టుకు పూర్తిస్థాయి స్పాన్సర్ గా ఉండనుంది. BCCI అధ్యక్షుడు రోజర్ బిన్నీ, డ్రీమ్ స్పోర్ట్స్ సహ యజమాని, సీఈవో హర్ష్ జైన్… కాంట్రాక్టు వివరాలను వెల్లడించారు.