Published 11 Jan 2024
ఉత్తర భారతం మరోసారి ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత(Magnitude)తో వచ్చిన భూప్రకంపనలకు భయం గుప్పిట కాలం గడిపింది. ఢిల్లీ-NCR(National Capital Region)తోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి కంపించడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. భూకంప కేంద్రం హిందూకుష్ పర్వతాల్లోని అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ కు 241 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని భూవిజ్ఞాన శాస్త్ర విభాగం తెలిపింది. 6.1 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు ఇళ్లల్లోని వస్తువులన్నీ కదలడంతో జనమంతా పరుగులు తీశారు.
ఆ దేశాల్లోనూ భారీగానే…
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లోనూ ఇదే తీవ్రత(Intensity) రావడంతో అక్కడ పరిస్థితి ఇబ్బందికరంగా మారగా.. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ సహా ప్రధాన నగరాల్ని భూకంపం తాకింది. లాహోర్, పెషావర్, ముజఫరాబాద్ తోపాటు హిమాలయ ప్రాంతాల్లోని భారత్, పాక్ అధీనంలోని భూభాగాల్లో దీని ప్రభావం కనిపించింది. కొద్ది నెలల క్రితమే అఫ్గాన్ లో 6.3తో వచ్చిన భూకంపం.. 2 వేల మందికి పైగా బలి తీసుకుంది. హెరాత్ ప్రావిన్స్ పరిస్థితి భయానకంగా మారి, వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.
వాళ్ల తీరే అంత…
2021లో తాలిబన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంటెద్దు పోకడలకు పోయి విదేశీ సాయం వద్దనడంతో.. ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం(Economic Crisis)లో చిక్కుకుంది. ఇప్పటికే కరవుతో అల్లాడుతున్న దేశాన్ని తాజా భూకంపాలు దారుణంగా మార్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అదే దేశంలో భూకంప కేంద్రం కొలువై ఉండటంతో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన అక్కడ కనిపిస్తోంది. 2022 జూన్ లో 5.9 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 1,000 మంది మృత్యువాత పడ్డారు.