Published 11 Jan 2024
రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేయడం.. గత సర్కారు తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీపై BRS అగ్రనేతలు ఎదురుదాడి మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తాము చేసినవన్నీ తప్పిదాలే అన్న రీతిలో మాట్లాడుతున్నారంటూ ఇంతకుముందే KTR, కడియం శ్రీహరితోపాటు పలువురు నేతలు హస్తం పార్టీ లీడర్లపై విమర్శలు చేశారు. ముందునుంచీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న హరీశ్ రావు సైతం.. ఇప్పుడు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. తామేంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తామన్న రీతిలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటిదాకా చేసింది చాలా స్వల్పమని, ఇకముందు ఉంది అసలు పండుగ అన్న రీతిలో కౌంటర్ ఇచ్చారు.
సినిమా చూపిస్తాం…
‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగిన మొన్నటి శాసనసభ తొలి సమావేశా(Assembly Sessions)ల్లో కాంగ్రెస్ సర్కారుకు ట్రైలర్ మాత్రమే చూపించాం.. ఇకముందు అసలు సినిమా ఎట్లుంటదో చూపించబోతున్నాం.. ప్రాజెక్టులు, పథకాల్లో అవినీతి అంటూ తప్పుడు(గోబెల్స్) ప్రచారం చేస్తున్నారు.. రానున్న రోజుల్లో BRS అంటే ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
కార్యకర్తల కోసం…
అధికారం కోల్పోయిన తర్వాత నిరాశలో కూరుకుపోయిన పార్టీ కార్యకర్తల్ని కాపాడుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే పురపాలక సంఘాల్లో అవిశ్వాస తీర్మానాలతో దిగువ శ్రేణి నాయకులకు కష్టకాలం మొదలైనట్లే ఉంది. నల్గొండ మున్సిపాలిటీని అవిశ్వాస తీర్మానంతో కోల్పోయిన విధంగా మరికొన్ని చోట్ల కూడా అదే తరహా వాతావరణం కనిపిస్తున్నది. ఇలాంటి దశలో కిందిస్థాయి కేడర్(Cadre)కు ఆత్మవిశ్వాసం కల్పించకపోతే అసలుకే ప్రమాదం అన్న ధోరణి.. గులాబీ పార్టీలో స్పష్టమవుతున్నది. అందులో భాగంగానేనా అన్నట్లు హరీశ్ కామెంట్స్ కూడా అందుకు తోడవుతున్నాయి. కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్న ఆయన అక్రమ కేసుల నుంచి కాపాడేందుకు సైతం లీగల్ సెల్ అందుబాటులోకి తెస్తున్నామన్నారు.