
Published 14 Jan 2024
భారత ప్రధానిపై అనుచిత కామెంట్స్ తో భారతీయుల బాయ్ కాట్ ఉద్యమం(Boycott Revolution) వల్ల అతలాకుతలమైన మాల్దీవులు.. చైనా మాయాజాలంలో చిక్కుకుంది. ఆ దేశాధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు చైనాలో ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ తో భేటీ అయి స్వదేశం చేరుకున్నాక భారత వ్యతిరేక నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ఆర్మీ తమ భూభూగం నుంచి ఖాళీ చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రెసిడెంట్ కార్యాలయ ప్రతినిధి(Representative)అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీంతో కూడిన టీమ్.. భారత అధికారుల కోర్ గ్రూప్ తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. మాల్దీవుల నుంచి భారత సైనికుల్ని మార్చి 15 లోపు వెనక్కు పంపాలన్నది ఈ మీటింగ్ సారాంశం.
తక్కువ సంఖ్యలోనే…
ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనికులున్నారు. అక్కడి భారత హైకమిషనర్ మును మహావార్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగ్గా.. తమ దేశం నుంచి సైనికులు తిరిగి వెళ్లాలంటూ ద్వీప దేశం(Island) ఆదేశించింది. చైనా అనుకూలవాది(Pro-China) అయిన మయిజ్జు సర్కారు తీసుకున్న నిర్ణయంపై భారతదేశం ఇంకా స్పందించలేదు. గతంలో పాలనా పగ్గాలు చేపట్టిన టైమ్ లోనే భారత బలగాల్ని వెనక్కు పంపుతామని అక్కడి ప్రజలకు మయిజ్జు చెప్పారు. ‘మాల్దీవుల బాయ్ కాట్’తో భారతీయుల టూర్స్ క్యాన్సిల్ అవుతున్నందున ఇక మీరే మమ్మల్ని ఆదుకోవాలంటూ మయిజ్జు చైనాను వేడుకున్నారు. మీ దేశవాసుల్ని మా దేశానికి పంపండి అంటూ అర్థించారు.
మాది చిన్న దేశమే.. అయినా…
మాల్దీవులు చిన్న దేశమే.. కానీ ఏ దేశానికి బానిస కాదు అని చైనా నుంచి తిరిగివస్తూ వెలానా ఎయిర్ పోర్టులో మయిజ్జు తీవ్రస్థాయిలో మాట్లాడారు. భారత్ పై ఆధారపడటం తగ్గించాలని భావిస్తూ… ఆహారం, మందులు(Medicine), ఇతర దిగుమతుల్ని వివిధ దేశాల నుంచి తెప్పించుకోవాలని డిసైడ్ అయ్యారు. మాలెలోని గత ప్రభుత్వం భారత్ తో 100 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోగా, ఇప్పుడు వాటన్నింటిపై రివ్యూ చేయాలని ప్రస్తుత సర్కారు ఆలోచన చేస్తున్నది. చైనా మాయలో పడి ఇప్పటికే పాకిస్థాన్, శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితుల్లో తాజాగా మాల్దీవులు తీసుకున్న నిర్ణయంతో ఆ దేశానికి ఇదే గతి పట్టొచ్చు అన్న మాటలు అంతర్జాతీయంగా వినపడుతున్నాయి.