Published 18 Jan 2024
వన్డే ప్రపంచకప్(ODI World Cup)కు ముందు అఫ్గానిస్థాన్ ను.. పసకూనగా టోర్నీలో అడుగుపెడుతుందని అనుకున్నారు. కానీ మ్యాచ్ లు జరిగే కొద్దీ ఆ టీమ్ ఎలా తయారైందో అందరూ చూశారు. పెద్దపెద్ద జట్లకు షాకిస్తూ సంచలన రీతిలో విజయాలు సాధించింది. దీంతో టీ20ల కోసం భారత్ లో అడుగుపెట్టిన అఫ్గాన్ ను అంత తేలిగ్గా తీసుకోవద్దనుకున్నారు. తొలి రెండు టీ20ల్లో ఓడి కప్పు చేజార్చుకున్న కసిలో ఉన్న ఆ టీమ్.. చివరి మ్యాచ్ లో మాత్రం ఆ కసినంతా బయటకు తీసింది. రెండు సూపర్ ఓవర్లకు దారితీసిన ఈ మ్యాచ్.. ఇరు జట్ల పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. 2020లో సూపర్ ఓవర్(Super Over) నిబంధన అమల్లోకి వచ్చాక రెండు సూపర్ ఓవర్లు నిర్వహించిన తొలి మ్యాచ్ గా ఇది రికార్డులకెక్కింది.
మ్యాచ్ ‘టై’
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. గత రెండు మ్యాచ్ ల్లో సున్నాకే వెనుదిరిగిన కెప్టెన్ రోహిత్(121; 69 బంతుల్లో 11×4, 8×6) తన పాత స్టైల్ ను నిద్రలేపడంతో టీమిండియా 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. జైస్వాల్(4), విరాట్(0), దూబె(1) వికెట్లు కోల్పోయినా రింకూ సింగ్(69; 39 బంతుల్లో 2×4, 6×6), రోహిత్ దడదడలాడించారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన అఫ్గాన్ సైతం తగ్గలేదు. ఓపెనర్లు గుర్బాజ్(50; 32 బంతుల్లో 3×4, 4×6), జద్రాన్(50; 41 బంతుల్లో 4×4, 1×6) ఎదురుదాడితో అఫ్గానిస్థాన్.. 93 రన్స్ దాకా వికెట్ కోల్పోలేదు. గుల్బదీన్ నైబ్(55; 23 బంతుల్లో 4×4, 4×6) సైతం ధాటిగా ఆడి స్కోరు లెవెల్ చేసే స్థాయికి తీసుకెళ్లాడు. ఇలా స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది.
సూపర్… సూపర్…
ముకేశ్ వేసిన తొలి సూపర్ ఓవర్లో నైబ్(1) రనౌట్ కాగా.. వరుస బాల్స్ లో నబి(1), గుర్బాజ్(4), గుర్బాజ్(1), నబి(6), బైస్(3)తో అఫ్గాన్ 16/1తో నిలిచింది. ఇక భారత్ సైతం అజ్మతుల్లా బౌలింగ్ లో వరుసగా రోహిత్(1 లెగ్ బై), జైస్వాల్(1), రోహిత్(6), రోహిత్(6), రోహిత్(1 రిటైర్డ్ ఔట్), జైస్వాల్(1)తో స్కోరు 16/1 అయింది. దీంతో రెండో సూపర్ ఓవర్ జరిగింది.
రెండో సూపర్ ఓవర్…
ఫరీద్ బౌలింగ్ వేసిన రెండో సూపర్ ఓవర్లో రోహిత్(6), రోహిత్(4), రోహిత్(1), రింకూ(ఔట్), రోహిత్(రనౌట్)తో టీమిండియా 11/2తో నిలిచింది. కానీ బిష్ణోయ్ వేసిన బాల్స్ కు ప్రత్యర్థి బ్యాటర్లు తేలిపోయారు. నబీ(ఔట్), కరీమ్(1), గుర్బాజ్(ఔట్) కావడంతో అఫ్గాన్ 1/2తో నిలిచి భారత్ కు మ్యాచ్ అప్పగించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను రోహిత్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ను శివమ్ దూబె అందుకున్నారు. 3 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసినా అఫ్గాన్ మాత్రం పట్టు వదలకుండా పోరాడి వారెవ్వా అనిపించింది.