Published 20 Jan 2024
ప్రముఖ టెన్నిస్(Tennis) క్రీడాకారిణి(Player)గా దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన స్టార్… సానియా మీర్జా. ఆటలోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ వార్తల్లో నిలిచిన ఆమె.. దేశ టెన్నిస్ రంగంలో మంచి పేరు సంపాదించింది. ఇవన్నీ ఒకెత్తయితే భారతదేశానికి దాయాదిగా భావించే పాకిస్థాన్ ప్లేయర్ తో ప్రేమలో పడింది. దేశ వాసుల నుంచి వ్యతిరేకత ఎదురైనా భయపడకుండా తను అనుకున్నది సాధించుకుంది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న ఆమెకు కుమారుడు ఉన్నాడు. దుబాయ్ లో కలుసుకున్న సానియా-షోయబ్ జోడీ.. 2010లో హైదరాబాద్ లో ఒక్కటైంది. ఇలాంటి పరిస్థితుల్లో షోయబ్ మరో వివాహం చేసుకున్నట్లు ప్రకటించాడు.
2022 నుంచి వేర్వేరుగా…
20 ఏళ్ల కెరీర్(Career)లో ఒక సింగిల్ ట్రోఫీతోపాటు మొత్తం 43 WTA(Women Tennis Association) టైటిల్స్ సాధించింది సానియా. అయితే 2022 నుంచి అంటే పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అనుకున్నట్లుగా ఇన్ స్టాగ్రామ్ లో సానియాను ఆమె భర్త ‘అన్ ఫాలో’ చేయడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. రూమర్స్ కు బ్రేక్ ఇస్తూ ఈ ఇద్దరూ వేరయ్యారు. ఇక సానియా మీర్జాతో విడాకులు తీసుకున్న తర్వాత షోయబ్ మాలిక్.. తాజాగా మరో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఈరోజు ట్విటర్(X)లో అతడే స్వయంగా పంచుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావెద్ ను పెళ్లి చేసుకున్న షోయబ్.. ఆ ఫొటోలను పోస్ట్ చేశాడు. సానియాను పెళ్లి చేసుకోకముందే అతడు మొదటి భార్యను వదిలిపెట్టాడు.
ముచ్చటగా మూడో పెళ్లి…
రైట్ హ్యాండ్ బ్యాటర్ గా, ఆఫ్ బ్రేక్ బౌలర్ గా పాకిస్థాన్ కు సేవలందించిన షోయబ్.. కెప్టెన్ గానూ వ్యవహరించాడు. 35 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడిన ఈ ఆల్ రౌండర్ కు సినీ యాక్టర్ సనా జావెద్ తో ప్రస్తుతం జరిగింది మూడో పెళ్లి. 2006లో ఆయేషా సిద్ధిఖీని, అనంతరం రెండో భార్యగా సానియా మీర్జాను మనువాడాడు. చెప్పులు కుట్టి జీవనం సాగించే షోయబ్ తండ్రి.. కొడుకుకు క్రికెట్ పట్ల ఉన్న మక్కువ(Interesting)తో అటు దిశగా పంపించాడు.