Published 20 Jan 2024
సినీ కథానాయిక(Cine Actress) రష్మిక మంధానను అసభ్యకరంగా చూపిస్తూ తయారు చేసిన వీడియోపై పోలీసుల దర్యాప్తు(Investigation) పూర్తయింది. ఈ వీడియో రూపకర్తగా భావిస్తూ కీలక నిందితుణ్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రష్మిక డీప్ ఫేక్ వీడియో పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు(Celebrities), రాజకీయ నేతల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి సైతం తీవ్రస్థాయిలో స్పందించారు. డీప్ ఫేక్ వీడియోల వల్ల ప్రముఖులే కాకుండా సామాన్యులు కూడా తలెత్తుకోలేని పరిస్థితి ఉందని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. వీటి రూపకర్తల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. అందులో భాగంగా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు నిందితుణ్ని పట్టుకున్నారు.
Also Read: డీప్ ఫేక్ వీడియోలు తీస్తే ఇక అంతే
గుంటూరు గుంటడి చేతివాటం
రష్మిక డీప్ ఫేక్ వీడియోను గుంటూరుకు చెందిన 24 ఏళ్ల ఈమని నవీన్ అనే వ్యక్తిని గుంటూరులో అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ DCP హేమంత్ తివారీ తెలియజేశారు. ఫాలోవర్ల సంఖ్య పెంచుకునేందుకు డీప్ ఫేక్ వీడియోను సామాజిక మాధ్యమా(Social Media)ల్లో పెట్టినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి ల్యాప్ టాప్, మొబైల్ ను స్వాధీనం చేసుకోగా.. డిలీట్ చేసిన డేటాను రికవరీ చేస్తున్నారు. సినీ నటి రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్ పేజీని నడిపాడని, రష్మికతోపాటు మరో రెండు పేజీల్ని కూడా రన్ చేసినట్లు గుర్తించామని DCP తెలిపారు. దీనిపై నవంబరు 10న కేసు ఫైల్ కాగా.. డీప్ ఫేక్ వీడియోలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, IT శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రత్యేక మీటింగ్ ను ఏర్పాటు చేశారు.
బాధితులుగా రష్మిక, కాజోల్
హీరోయిన్ రష్మిక మంధాన, బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ సైబర్ క్రైమ్ బారిన పడ్డారు. వీరి ఫేస్ లను AI ద్వారా మార్ఫింగ్ చేసిన డీప్ ఫేక్ వీడియోలు గతేడాది నవంబరు నుంచి వైరల్ గా మారాయి. నల్లటి యోగా బాడీసూట్ ధరించిన బ్రిటీష్ మోడల్.. కెమెరా కోసం నవ్వుతూ ఎలివేటర్ లోకి ఎంటర్ అయిన సమయంలో తీసిన వీడియోను రష్మిక ఫేస్ తో మార్ఫింగ్ చేశారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ట్విటర్(X)లో పోస్టులు పెట్టారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తోపాటు పలువురు స్పందించి ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. అచ్చంగా కాజోల్ కూడా దుస్తులు మార్చుకుంటున్నట్లు డీప్ ఫేక్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇలాంటి పోస్టులపై సీరియస్ గా ఉన్న కేంద్ర ప్రభుత్వం నూతన చట్టం దిశగా చర్యలు చేపట్టింది.