
Published 21 Jan 2024
రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 89.98 లక్షలు.. కానీ గ్యాస్ సిలిండర్(Cylinder) కోసం వచ్చిన దరఖాస్తులు(Applications) 91.50 లక్షలు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు రేషన్ కార్డే ప్రామాణికం అయినపుడు వాటికన్నా సిలిండర్లకే ఎక్కువ అప్లికేషన్లు రావడం ఆశ్చర్యకరంగా మారింది. అభయహస్తం గ్యారంటీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కోసమే భారీగా దరఖాస్తు చేసుకున్నారు. రూ.500 సిలిండర్ తోపాటు ఆరు గ్యారంటీలకు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. కానీ రేషన్ కార్డుల కన్నా మిన్నగా రూ.500 సిలిండర్ అప్లికేషన్లు రావడం వింతగా మారింది. ఈ గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించిన ఆన్ లైన్(Online) ప్రక్రియ సందర్భంగా ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: రాష్ట్రమంతా ‘పేదలే’నా.. అంతలా అప్లికేషన్లు…!
రెండు నెలలకొకటి చొప్పున…
రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలు(Poor Families) ప్రస్తుత అంచనాల ప్రకారం రెండు నెలలకొకటి చొప్పున సిలిండర్ వాడుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే, అందులో 45 శాతం లోపు కుటుంబాలు మాత్రమే నెలకోసారి సిలిండర్ తీసుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం ఆరు సిలిండర్లను రూ.500కు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంపై రెండున్నర వేల కోట్ల రూపాయల భారం పడుతుందని అధికారులు లెక్కలు వేశారు. ఇక ఏడాదికి 12 ఇస్తే మాత్రం ఆ సొమ్ము డబుల్ అవుతుంది. కొన్ని మారుమూల ప్రాంతాల్లో పింఛను కన్నా సబ్సిడీ సిలిండర్లకే అప్లికేషన్లు ఎక్కువున్నాయి.
Also Read: కొత్త ‘రేషన్ కార్డుల’పై క్లారిటీ…
ఏరివేస్తేనే ప్రయోజనం…
రాష్ట్ర జనాభా 3.95 కోట్లయితే రేషన్ కార్డుల సంఖ్య 89.98 లక్షలు. ఇలా మొత్తంగా 2.85 కోట్ల మందికి రేషన్ కార్డుల్లో పేర్లుంటే వీరి శాతం 71.5గా ఉంది. ఇక కార్డుల్లో కొత్త పేర్లు చేర్చాలంటూ 11 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటన్నింటినీ కలిపితే లబ్ధిదారుల సంఖ్య 3 కోట్లు దాటి బీదలు 75% దాటిపోతున్నారు. కానీ ఇందులో 9.90 లక్షల కార్డుదారులు అసలు రేషనే తీసుకోవడం లేదు. అంటే రేషన్ తీసుకోనివారి శాతం 11గా ఉంది. ఆరోగ్యశ్రీ, ఇతర స్కీమ్ ల కోసమే కార్డులు తీసుకున్నారు. ఇలాంటి వారిని ఏరిపారేస్తే తప్ప సామాన్యులకు ప్రయోజనం అందదు. పైగా ఏటా వందల కోట్ల రూపాయల గవర్నమెంట్ సబ్సిడీ పక్కదారి పట్టే అవకాశం ఉండదు.