Published 21 Jan 2024

రేవంత్ రెడ్డి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న పలువురికి సలహాదారుల పోస్టులు కట్టబెడుతూ జీవోలు జారీ చేసింది. అటు ప్రభుత్వానికి ముగ్గురు సలహాదారులు(Advisors), ముఖ్యమంత్రికి ఒకర్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో ఇద్దరికి కేబినెట్(Cabinet) హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు(Public Affairs)గా కేబినెట్ హోదాలో వేం నరేందర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మొన్నటి ఎన్నికల్లో రేవంత్ కోసం సీటు త్యాగం చేసిన షబ్బీర్ అలీని సైతం సలహాదారుగా నియమించింది. ఈ ఇద్దరితోపాటు మల్లు రవి, వేణుగోపాల్ రావును సైతం అడ్వయిజర్లుగా నియామకం చేపట్టింది.
ఢిల్లీ ప్రతినిధిగా రవి…
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక ప్రొటోకాల్, ప్రజాసంబంధాల సలహాదారుగా హర్కార వేణుగోపాల్ రావును ఎంపిక చేశారు. BC, SC, ST, మైనారిటీ శాఖలను సలహాదారు హోదాలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ చూస్తారు. కొత్తగా నియమితులైన ఈ నలుగురూ కేబినెట్ హోదాలో విధులు నిర్వర్తించనున్నారు. రేవంత్ బాధ్యతలు అప్పజెపుతున్న నలుగురు సలహాదారులూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా చలామణి అవుతున్నారు.
అందరూ సీనియర్లే…
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుంచి మూడు సార్లు శాసనసభకు, నాగర్ కర్నూల్ నుంచి మూడు సార్లు లోక్ సభకు పోటీ చేశారు మల్లు రవి. 1991-96, 1998-99 వరకు ఆయన నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడి(MP)గా పనిచేసి 1999లో ఓటమి పాలయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో జడ్చర్ల నుంచి అసెంబ్లీ ఎన్నికైన రవి.. 2009, 2014 ఎలక్షన్లలో ఓడిపోయిన ఆయన ప్రస్తుతం ఆయన PCC ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
1970లో NSUIలో చేరిన షబ్బీర్ అలీ.. 2013 నుంచి 2019 వరకు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ శాసనమండలినేతగా వ్యవహరించారు. 1993లోనే మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులై దేశంలోనే తొలి మైనార్టీ మంత్రిగా రికార్డు సాధించారు. ఇక వేం నరేందర్ రెడ్డి TDPలో ఉన్నప్పట్నుంచి రేవంత్ కు సన్నిహితంగా ఉంటున్నారు. రేవంత్ కు అత్యంత సన్నిహిత నేతల్లో సీతక్క, వేం నరేందర్ రెడ్డి ముఖ్యులు. AICC జనరల్ సెక్రటరీగా ఉన్న హర్కారా వేణుగోపాల్.. PCC ప్రొటోకాల్ ఛైర్మన్ గానూ పనిచేస్తున్నారు.