Published 21 Jan 2024
ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను అధిగమించి అన్ని రికార్డులు(All Records) అందుకునే స్థాయి గల ప్లేయరని ఏనాడో కితాబు… రన్ మెషిన్ గా, 35 ఏళ్ల వయసులోనూ గ్రౌండ్ లో చురుగ్గా కదులుతూ యువ ప్లేయర్లకు స్ఫూర్తిమంతం(Inspiration)గా నిలుస్తున్న అతడికి మరో రికార్డు స్వాగతం పలుకుతున్నది. భారత్ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానగణాన్ని(Fans) సంపాదించుకున్న ఆ ఆటగాడే విరాట్ కోహ్లి. ఈ దిగ్గజ ప్లేయర్ మరో మైల్ స్టోన్ ను చేరుకునేందుకు సమయం ఆసన్నమైంది. త్వరలోనే ఇంగ్లండ్ తో జరగనున్న ఐదు టెస్ట్ సిరీస్ లో ఆ కల సాకారం చేసుకోబోతున్నాడు. టెస్టుల్లో 9,000 పరుగుల మైలురాయికి కొద్ది దూరంలో నిలిచాడు ఈ ఢిల్లీ బ్యాటర్.
ఈ మధ్యే 50 సెంచరీలు…
విరాట్ కోహ్లి ఈ మధ్యనే బ్యాటింగ్ దిగ్గజం సచిన్(49) సెంచరీల మార్క్ ను దాటి వన్డేల్లో 50వ సెంచరీని అందుకున్నాడు. గతేడాది నవంబరులో న్యూజిలాండ్ తో సచిన్ సొంతగడ్డ అయిన వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో.. టెండూల్కర్ కళ్లెదుటే అతడి రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఇంగ్లండ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ ఈనెల 25న హైదరాబాద్ లో మొదలవుతుంది. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు విరాట్. అతడు ఇప్పటివరకు 113 టెస్టుల్లో 8,848 రన్స్ చేసి 9,000 క్లబ్ కు మరో 152 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ వయసులోనూ టీ20ల్లో పునరాగమనం చేసిన ఈ రన్ మెషిన్ పేరిట టెస్టుల్లో ప్రస్తుతానికి 30 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలున్నాయి.
ముందున్నది ముగ్గురు దిగ్గజాలే…
విరాట్ కోహ్లి కన్నా ముగ్గురు భారత దిగ్గజాలు ముందు వరుసలో ఉన్నారు. ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అతడు 200 టెస్టుల్లో 53.78 యావరేజ్ తో 15,921 పరుగులు చేశాడు. ఇక భారత బ్యాటింగ్ లెజెండ్, ‘ది వాల్’గా ముద్రపడి ప్రస్తుతం టీమ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. అత్యధిక పరుగుల లిస్టులో రెండో స్థానం(Second Place)లో ఉన్నాడు. 163 టెస్టుల్లో 52.63 సగటుతో ద్రవిడ్ 13,265 రన్స్ చేశాడు. ఇక తర్వాతి(మూడో) స్థానాన్ని లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ ఆక్రమించాడు. ఈ మాజీ దిగ్గజం 115 టెస్టులాడి 51.12 సగటు(Average)తో 10,122 పరుగులు చేశాడు. సొంతగడ్డపై జరిగిన గత టెస్టు సిరీస్ లో ఇంగ్లండ్ టీమ్.. భారత్(2-2)తో సిరీస్ ను పంచుకుంది.