Published 23 Jan 2024
అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య అనుమానాలు, అపోహలు, ఆరోపణలు నెలకొన్న వేళ… ఆశ్చర్యకర భేటీ జరిగింది. భారత్ రాష్ట్ర సమితి(BRS)కు చెందిన నలుగురు శాసనసభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఈ నలుగురు MLAలు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. మాజీ మంత్రి, నర్సాపూర్ MLA సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్ చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాణిక్ రావు… CMను కలిసిన వారిలో ఉన్నారు.
మంత్రుల కామెంట్స్… అంతలోనే…
బీఆర్ఎస్ కు చెందిన పలువురు MLAలు టచ్ లో ఉన్నారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతోపాటు మంత్రులు సైతం పదే పదే చెబుతున్నారు. మరో మంత్రి ఏకంగా 30 మంది BRS శాసనసభ్యులు తమ వైపు చూస్తున్నారని మాట్లాడారు. మరో ఏడెనిమిది సీట్లు వస్తే హంగ్ ఏర్పడేదని మాజీ మంత్రి KTR కామెంట్ చేశారు. ఇలా అధికార, విపక్ష నేతల పరస్పర విమర్శలు, ఎదురుదాడుల నడుమ నలుగురు MLAలు సీఎం ఇంటికి వెళ్లి మరీ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇంటెలిజెన్స్ ఐజీని…
ముఖ్యంగా BRSకు కంచుకోటగా భావిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు రేవంత్ ను కలవడం ఆశ్చర్యకరంగా తయారైంది. మర్యాదపూర్వకంగానే కలిశామని చెబుతున్నా.. ఈ నలుగురూ ఆ తర్వాత ఇంటెలిజెన్స్ IG శివధర్ రెడ్డిని కూడా కలవడం ఊహాగానాలకు అవకాశమిచ్చినట్లయిందన్న గుసగుసలు వినపడుతున్నాయి. BRS లీడర్లు తమకు 100 మీటర్ల దూరంలోనే ఉన్నారని నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి అనడం సంచలనంగా మారింది. ఆయన అన్న నాలుగు రోజులుకే ఈ నలుగురు కలవడం ఇష్యూను ఇంట్రెస్టింగ్ గా తయారు చేసింది.