Published 23 Jan 2024
‘ఆస్కార్(Oscar)’ పురస్కారాలంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆసక్తే. ఇక అవార్డులు పొందడమంటే అంతకన్నా మించిన ఆనందం నటులకు జీవితంలో మరేదీ ఉండదు. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో(Indian Film Industry) భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ‘ఆస్కార్’ అవార్డా.. అది భారతీయులకా అన్న స్థాయి నుంచి ఇప్పుడు భారతీయులకు కూడా భారీగానే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఈ మధ్యకాలంలోనే ‘RRR’ మూవీకి ‘ఆస్కార్’ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. అలాంటి సుప్రసిద్ధ అవార్డులకు ఈ సంవత్సరం మరో భారతీయ చిత్రం నామినేట్ అయింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 96వ అకాడెమీ అవార్డు(Academy Award)కు నామినేట్ అయింది.
జార్ఖండ్ గ్యాంగ్ రేప్ కేసు…
జార్ఖండ్ కు చెందిన పదమూడేళ్ల బాలికపై దారుణంగా జరిగిన సామూహిక అత్యాచారం(Gangrape) కేసులో వాస్తవాల్ని చిత్రీకరించిన ‘టు కిల్ ఎ టైగర్(To Kill A Tiger)’ డాక్యుమెంటరీ.. ఆస్కార్ కు నామినేట్ అయింది. కెనడాలోని టొరంటోకు చెందిన నిషా పహుజా దర్శకత్వంలో ఈ ఫిల్మ్ రూపుదిద్దుకుంది. అత్యంత క్రూరంగా జరిగిన గ్యాంగ్ రేప్ వల్ల తమ కూతురు అనుభవించిన శిక్షపై ఆమె తల్లిదండ్రులు న్యాయస్థానా(Courts)ల్లో పోరాటం చేశారు. ఒక సామాన్యుడు విపరీతమైన పరిస్థితుల్లో సాగించిన ‘ఉద్వేగపూరిత ప్రయాణా(Emotional Journey)న్ని’ కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిజ జీవిత కథ ఆధారంగా తీసిన ఈ డాక్యుమెంటరీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
భారమైన హృదయాలతో…
‘టు కిల్ ఎ టైగర్’ ఫిల్మ్ ఉత్తర అమెరికాలో గతేడాది విడుదల కాగా.. ఏ డాక్యుమెంటరీకి దక్కనంత ఆదరణ దీనికి లభించింది. బ్రిటిష్ ఇండియన్ యాక్టర్ దేవ్ పటేల్, భారతీయ అమెరికన్ నటి మిండీ కేలింగ్, ఇండో-కెనడియన్ కవి రూపీ కౌర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా ఈ ఫిల్మ్ కు మద్దతుగా నిలిచారు. ఒక తండ్రి తన కూతురు కోసం చేసిన పోరాటం ఊరినే కాదు, భారత దేశాన్నే కాదు.. ఏకంగా ప్రపంచ దృక్పథాన్నే మార్చింది అంటూ టిఫ్ జ్యూరీ అభినందనల వర్షం కురిపించిది. సినిమా తీస్తున్నప్పుడు భారమైన హృదయాలతో ఉండిపోవాల్సి వచ్చిందని, అయినా తండ్రి, కూతురు, కుటుంబం గురించి తీయాల్సి వచ్చినపుడు ఎంతటి అవమానాల్నైనా భరించాలని నిర్ణయించుకున్నా అని డైరెక్టర్ నిషా పహుజా ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడారు.
మరో ఐదు కూడా…
డాక్యుమెంటరీ కేటగిరీలో మరో ఐదు ఫిల్మ్ లు చోటు సంపాదించాయి. ‘బాబీ వైన్(Bobi Wine)’, ‘ద పీపుల్స్ ప్రెసిడెంట్(The People’s President)’ ‘ద ఎటర్నల్ మెమొరీ(The Eternal Memory)’, ‘ఫోర్ డాటర్స్(Four Daughters)’, ‘ట్వంటీ డేస్ ఇన్ మరియపోల్(Twenty Days In Mariupol)’ ఫిల్మ్ లు నామినేట్ అయినవాటిలో ఉన్నాయి. ఈ ఆస్కార్ పురస్కార వేడుకల్ని మార్చి 10న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో నిర్వహిస్తారు.