Published 24 Jan 2024
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరుగుతున్న పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్, విపక్ష BRS మధ్య పోరు గరం గరంగా మారింది. ఇప్పటికే రెండు పార్టీల అగ్ర నేతలు(Top Leaders) పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మరో ఏడెనిమిది సీట్లొస్తే హంగ్ వచ్చేదని KTR.. 30 మంది MLAలు మా వైపు చూస్తున్నారంటూ కాంగ్రెస్ మంత్రులు చేసిన ప్రకటనలతో గందరగోళం ఏర్పడింది. అధికార పార్టీ వైపు చూస్తున్న శానససభ్యులెవరో తేల్చే పనిలో పడ్డ BRSకు.. తాజాగా నలుగురు MLAలు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని కలవడం గందరగోళానికి దారితీసినట్లే ఉంది. ఈ నలుగురి ప్రత్యేక భేటీపై.. మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆ ఎమ్మెల్యేలంతా రెస్పాండ్ అయ్యారు. కేవలం అభివృద్ధి పనుల కోసమే CMను కలిశామని వివరణ ఇచ్చుకున్నారు.
బీఆర్ఎస్ లో సమాలోచనలు…
ముఖ్యమంత్రిని ఆయన ఇంటికి వెళ్లి మరీ కలవడం, ఆయన్ను కలిసినవారిలో గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు ఉండటం సంచలనానికి దారితీసింది. CMను కలిసిన MLAల్లో సునీతా లక్ష్మారెడ్డి.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈ నలుగురు ఎందుకు CMను కలవాల్సి వచ్చిందన్న చర్చ జోరుగా సాగుతున్న పరిస్థితుల్లో భారత్ రాష్ట్ర సమితి సమాలోచనల్లో పడిపోయింది. కేవలం ముఖ్యమంత్రినే కాకుండా ఇంటెలిజెన్స్ IG శివధర్ రెడ్డితోనూ ఈ నలుగురు శాసనసభ్యులు భేటీ అయ్యారు. మెదక్ నుంచి అత్యధిక స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ కు.. అదే జిల్లాకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులు సీఎంతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ MPగా ఉన్న సమయంలోనూ అయనకు దుబ్బాక సీటు కేటాయించి మరీ పార్టీ గెలిపించుకుంది.
నలుగురి సంయుక్త వివరణ…
ముఖ్యమంత్రిని కలవడంపై సొంత పార్టీలోనే కాదు బయట కూడా ఈ అంశం హాట్ టాపిక్ గా మారడంతో సదరు నలుగురు MLAలు స్పందించారు. ఇందులో ఇద్దరు నిన్ననే రెస్పాండ్ కాగా… ఈరోజు ఈ నలుగురు కలిసి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. KCRపైనే తమకు పూర్తి విశ్వాసం ఉందంటూ ఈ ఐదేళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి చేయాలో తమకు తెలుసున్న రీతిలో మాట్లాడారు. ముఖ్యమంత్రినే కాదు మిగతా మంత్రులనూ కలుస్తామని గట్టిగానే కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ అంశం నిన్నట్నుంచి గరం గరంగా మారిన పరిస్థితుల్లో మరి దీనిపై ప్రధాన ప్రతిపక్షం ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.