Published 25 Jan 2024
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి తన మనసులో మాటను గట్టిగానే వినిపించారు. అనుకున్నది చేసే వరకు వదిలిపెట్టని ఆమె.. ఈసారి అదే తీరును చూపించారు. ఓటు విషయంలో ఎవ్వరూ రాజీ పడకూడదంటూ పిలుపునిచ్చారు. విదేశాలకు వెళ్లేవారు వీసా కోసం ఎలా క్యూలో నిల్చుంటారో పోలింగ్ నాడు కూడా అలాగే ఉండాలని స్పష్టం చేశారు. జాతీయ ఓటరు దినోత్సవం(National Voter Day) సందర్భంగా హైదరాబాద్ JNTUలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె అటెండ్ అయ్యారు. పోలింగ్ కోసం ఇచ్చే హాలిడే విహారయాత్రకు కాదని అది ఓటు కోసమని గుర్తు చేశారు.
కౌశిక్ రెడ్డికి మరోసారి…
హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ మరోసారి షాకిచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఆమె తాజాగా స్పందించారు. ఓటు వేయకుంటే చనిపోతామంటూ అభ్యర్థి ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని, ఎన్నికల్ని ప్రభావితం చేసే ఇలాంటి కామెంట్స్ పై ఎలక్షన్ కమిషన్(EC) చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించడం(Blackmail) లాంటిదేనని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హుజూరాబాద్ నుంచి విజయం సాధించి శాసనసభ(Assembly)లో అడుగుపెట్టిన కౌశిక్ రెడ్డికి.. గవర్నర్ తమిళిసై షాక్ ఇవ్వడం ఇది రెండోసారి.
BRS హయాంలో…
గవర్నర్ కోటాలో కౌశిక్ ను MLCగా నామినేట్ చేస్తూ గత BRS ప్రభుత్వం తమిళిసైకి ఉత్తర్వులు పంపింది. నిబంధనలు పాటించకుండా గవర్నర్ కోటాలో ఆయన్ను నామినేట్ చేయడం విరుద్ధమని, రాజ్యాంగం పేర్కొన్న అర్హతలకు కౌశిక్ సరితూగబోరంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపిన ఫైల్ ను గవర్నర్ తిప్పి పంపారు. ఇది అప్పుడు పెద్ద వివాదానికి దారితీసి KCR సర్కారుకు, గవర్నర్ మధ్య దూరాన్ని పెంచింది. తమిళిసై నిర్ణయంతో చేసేదిలేక కౌశిక్ ను MLCగా చేసుకోలేకపోయింది KCR సర్కారు. ఇప్పుడు ప్రభుత్వం మారి కౌశిక్ రెడ్డి చట్టసభలకు ఎన్నికైనా మళ్లీ గవర్నర్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు.