Published 25 Jan 2024
ప్రత్యర్థిపై ఇంగ్లండ్ ప్రయోగించాలనుకున్న ఆయుధం వారికే ఎదురుతిరిగింది. భారత్ ను దెబ్బకొట్టాలని చూస్తే అది రివర్స్ అయి ఇంగ్లండ్ కే కష్టకాలం తెచ్చిపెట్టింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు(First Test) మ్యాచ్ లో తొలి రోజు భారత్ పూర్తి ఆధిపత్యం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్న ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగి భారత్… జైస్వాల్ దూకుడైన బ్యాటింగ్ తో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 119 రన్స్ చేసింది.
దంచికొట్టిన జైస్వాల్…
ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఇది టెస్ట్ మ్యాచా, టీ20యా అన్నట్లు ఆడాడు. యశస్వి(76 నాటౌట్; 70 బంతుల్లో, 9×4, 3×6) ధనాధన్ ఆటతీరుతో ఇంగ్లండ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 27 బాల్స్ లో 24 పరుగులు చేసి ఔట్ కాగా.. గిల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ముఖ్యంగా జైస్వాల్ 47 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఫస్ట్ వికెట్ కు జైస్వాల్, రోహిత్ జోడీ 39 బంతుల్లోనే 50 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ విలవిల…
అంతకుముందు భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ విలవిల్లాడింది. కెప్టెన్ బెన్ స్టోక్స్(70), జానీ బెయిర్ స్టో(37), బెన్ డకెట్(35), జో రూట్(29) పరుగులు చేశారు. ఓపెనర్లిద్దరినీ అశ్విన్ వెనక్కు పంపితే తర్వాతి రెండు వికెట్లను జడేజా తీసుకున్నాడు. టీమిండియా బౌలర్ల ధాటికి స్టోక్స్ సేన.. 155కే 7 వికెట్లు కోల్పోయింది.
అశ్విన్, జడేజా మూడేసి… అక్షర్, బుమ్రా రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లండ్ ను అందుకోవడానికి భారత్ కు కావాల్సింది ఇంకా 127 పరుగులే.