Published 25 Jan 2024
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు బాధ్యత.. రేవంత్ సర్కారుపై ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటికే రెండింటిని అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంటే అందులో ఉచిత ఆర్టీసీ ప్రయాణం(Free Journey) ఒకటి కాగా.. మరొకటి ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం. ముఖ్యంగా ఈ గ్యారంటీలతోపాటు సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్న స్కీమ్ లు ఇప్పుడు కత్తిమీద సాములా మారాయి. వాటికి ఎలాగైనా నిధులు కేటాయించి అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో అత్యంత ముఖ్యమైంది రైతుభరోసా నిధులు. పంట పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా డబ్బులు ఖాతా(Accounts)ల్లో వేయాలని నెల రోజుల నుంచి రైతులు కోరుతూనే ఉన్నారు.
నిధులపై సీఎం నోటి వెంట…
రైతులు ఎదురుచూస్తున్నట్లుగా పెట్టబడి సాయాన్ని ఫిబ్రవరి(వచ్చే నెల) చివరికల్లా ఖాతాల్లో వేస్తామని స్వయంగా ముఖ్యమంత్రే హామీ ఇచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశంలోనే ప్రకటన చేశారు. ఈ విషయంలో అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందొద్దని గుర్తు చేశారు. డిసెంబరులో యాసంగి పంటలు వేస్తున్న సమయంలోనే తమకు రైతు భరోసా ఇవ్వాలని రైతులు అప్పుడు కోరారు. పంటలు వేసి రెండు నెలలు గడుస్తున్నా దీనిపై సర్కారు నుంచి క్లారిటీ లేకపోవడంతో అనుమానాలు ఏర్పడ్డాయి. అందరిలో సంశయాలు కనిపిస్తున్న వేళ.. రేవంతే దీనిపై ప్రకటన చేయడంతో ఆశలు కనిపిస్తున్నాయి. ఏటా ఎకరానికి రైతులు, కౌలు రైతులకు రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000, వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.