Published 25 Jan 2024
అతడు బ్యాటింగ్ కు దిగుతున్నాడంటే ఆ దూకుడు ముందు ప్రత్యర్థి చిన్నబోవాల్సిందే. అపోజిషన్ టీమ్ కు భారీ టార్గెట్ ఇవ్వడం కాదు.. తన ముందు పెద్ద లక్ష్యం(Huge Target) ఉంటేనే మజా అన్నట్లుంటుంది అతడి ఆటతీరు. అలాంటి విలక్షణ(Variety) ఆటతీరుకు నిదర్శనంగా నిలిచే క్రికెటర్ విరాట్ కోహ్లి. రన్ మెషిన్, కింగ్ కోహ్లిగా ప్రసిద్ధి చెందిన ఈ సీనియర్ బ్యాటర్.. మరో ప్రతిష్ఠాత్మక అవార్డు(Prestigious Award)ను సొంతం చేసుకున్నాడు. గతేడాదంతా వన్డేల్లో చూపిన అత్యుత్తమ బ్యాటింగ్ కు గాను ‘ICC మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచాడు.
నాలుగుసార్లు అవార్డు…
విరాట్ కు ‘ICC మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రావడం ఇది నాలుగోసారి. అతడిని 2012, 2017, 2018, 2023 సంవత్సరాలకు ఈ పురస్కారాలు వరించాయి. ఈ విషయంలో విరాట్ కోహ్లికి దరిదాపుల్లోనూ కూడా ఏ క్రికెటర్ లేకపోవడం విశేషం. ఇప్పటిదాకా ఈ ఢిల్లీ ప్లేయర్ మొత్తం 10 ICC అవార్డులు సాధిస్తే శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర మాత్రమే ఇప్పటివరకు 4 పురస్కారాలు అందుకున్నాడు. అంటే కింగ్ కోహ్లిలో సగం అవార్డులు కూడా తీసుకున్నవారు లేరన్నమాట.
నంబర్ వన్ గా సూర్యకుమార్…
అటు 2023 టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సూర్యకుమార్ గెలుచుకున్నాడు. జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రజా, న్యూజిలాండర్ మార్క్ ఛాప్మన్, ఉగాండా క్రికెటర్ అల్పేక్ పోటీపడ్డా.. చివరకు ఆ అవార్డు సూర్యనే వరించింది. గతేడాది 17 ఇన్నింగ్స్ ల్లో సూర్య 48 యావరేజ్ తో 733 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉంటే, స్ట్రైక్ రేట్(Strike Rate) 155.