Published 26 Jan 2024
కాంగ్రెస్-BJP రహస్య మైత్రి గవర్నర్ ద్వారా మరోసారి బయటపడిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కామెంట్ చేశారు. రాజకీయ పార్టీ(Political Parties)ల్లో కొనసాగుతున్నారన్న కారణంతో గతంలో తమ ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను తిప్పి పంపిన గవర్నర్… ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని MLCగా ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ చీఫ్ ను సిఫారసు చేస్తే ఆమోదించడం ద్వంద్వ(Dual) నీతి కాదా అని ట్విటర్(X) వేదికగా కామెంట్ పెట్టారు. కోదండరామ్ ను నామినేట్ చేయడంపై హరీశ్ ఈ విధంగా పోస్ట్ పెట్టారు. ‘గవర్నర్ కోటా MLCల నియామకా(Recruitment)ల విషయంలో రెండు పార్టీల మధ్య గల అవగాహన బట్టబయలైంది. BJP అజెండాకు అనుగుణంగా.. కాంగ్రెస్ సర్కారుకు, హస్తం పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు’.. అంటూ హరీశ్ మండిపడ్డారు.
మాకొకటి, వాళ్లకొకటా…
ఇంకా హరీశ్ ఏమన్నారంటే… ‘గతంలో తమ ప్రభుత్వం క్రీడా, సాంస్కృతిక, విద్య, సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని MLCలుగా సిఫారసు చేస్తే గవర్నర్ తిరస్కరించారు.. మరి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి పేరు పంపితే ఆమోదించారు.. ఇది ద్వంద్వ నీతి కాదా.. రాష్ట్రంలో కాంగ్రెస్, BJP ఒక్కటై BRSను అణగదొక్కాలని చూస్తున్నయ్.. ఈ కుట్రలో గవర్నర్ భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరం.. న్యాయసూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అందరికీ ఒకేలా ఉండాలి’.. అంటూ హరీశ్ పోస్ట్ చేశారు.