Published 28 Jan 2024
తొలి రెండు సెట్లు కోల్పోయినా… ఎదుట ఉన్నది గొప్ప ఆటగాడు అని తెలిసినా.. ఆత్మవిశ్వసం ముందు అన్నీ బలాదూర్ అని నిరూపించాడా చిన్నోడు. ఫైనల్ చేరడానికి ఎంత కష్టపడ్డాడో.. కప్పును అందుకోవడానికి అదే రీతిలో పోరాటం(Fight) చేసి సక్సెస్ అయ్యాడు. అత్యంత చిన్న వయసులోనే ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ కలను నెలవేర్చుకున్న ఆ కుర్రాడే జేనిక్ సినర్. నాలుగో సీడ్ గా బరిలోకి దిగిన ఈ చిన్నోడిపై పెద్దగా ఆశలు లేవనే చెప్పాలి. కానీ సెమీఫైనల్ తోపాటు ఫైనల్ లోనూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అద్భుతాన్ని సృష్టించాడు.
22 సంవత్సరాల వయసు గల ఈ ఇటలీ(Italy) ఆటగాడు వరుసగా రెండు సెట్లు కోల్పోయినా అధైర్యం కోల్పోకుండా అనుకున్నది సాధించాడు. ఫైనల్ లో రష్యాకు చెందిన డేనియల్ మెద్వదేవ్ పై 3-6, 3-6, 6-4, 6-4, 6-3తో విజయం సాధించిన సినర్.. మేటి ఆటగాళ్లను మట్టి కరిపించి ట్రోఫీని ముద్దాడాడు.
సెమీస్ లో దిగ్గజాన్ని ఓడించి…
ఫైనల్ చేరడానికి జేనిక్ సినర్.. ఒక్కో మెట్టే ఎదుగుతూ వచ్చాడు. సెమీ ఫైనల్ లో టాప్ సీడ్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ను మట్టి కరిపించి మరీ తుది పోరుకు చేరుకున్నాడు. 2022 ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ లోనూ మెద్వదేవ్ కు ఇదే అనుభవం(Experience) ఎదురైంది. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ పై ఆధిక్యంలో ఉన్నా చివరకు మ్యాచ్ ను దాంతోపాటు ట్రోఫీని కోల్పోవాల్సి వచ్చింది. మూడోసీడ్ గా టోర్నీలో అడుగుపెట్టిన 27 ఏళ్ల రష్యా సంచలనం మెద్వదేవ్ ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ కోల్పోవడమే కాదు.. గత కొద్దికాలంలో ఆడిన ఆరు ఫైనల్స్ లో ఐదింటిని చేజార్చుకున్న రికార్డును మూటగట్టుకున్నాడు.