Published 29 Jan 2024
కాంగ్రెస్ పార్టీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. మోదీ మళ్లీ గెలిస్తే దేశంలో ఇక ఎన్నికలే ఉండవంటూ మాట్లాడారు. ఒకవేళ దేశంలో మరోసారి BJP(Bharatiya Janatha Party) ఏర్పడితే మోదీ సర్కారు నియంతృత్వంగా మారుతుందని, దీనివల్ల దేశంలో ప్రజాస్వామ్యం(Democracy) అనేదే లేకుండా పోతుందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే నరేంద్ర మోదీని ఓడించాల్సిన అవసరముందని ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లా మోదీ జీవితకాలం పదవిలో ఉంటారంటూ విమర్శలు చేశారు.
ఇండియా కూటమికి ఎదురుదెబ్బలు…
ఈ వారం రోజుల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి(INDIA Alliance)కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో హస్తం పార్టీతో పొత్తు ఉండబోదని ఇప్పటికే పశ్చిమబెంగాల్, పంజాబ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, భగవంత్ సింగ్ మాన్ గట్టిగానే క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పై కోపంతో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ… ఇక ఎలాంటి పొత్తులుండబోవని తేల్చి చెప్పాయి. ఇటు బిహార్ లో రాజకీయాలు(Politics) రెండ్రోజుల్లోనే అనూహ్యంగా మారిపోయాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇండియా కూటమి నుంచి వైదొలుగుతూ CM పదవికి రాజీనామా చేసి.. తిరిగి ఏడాదిన్నర తర్వాత BJPతో జట్టు కట్టి మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఇలా ఒకటి తర్వాత ఒకటి ఎదురుదెబ్బ తగలడంతో కాంగ్రెస్ పార్టీ నిస్సహాయతలో పడిపోయింది. ఒకేసారి ముగ్గురు ముఖ్యమంత్రులు ప్లేటు ఫిరాయించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. లోక్ సభ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడం, రాజ్యసభకు ఇప్పటికే షెడ్యూల్ వెలువడటంతో తమ కూటమికి వీలైనన్ని సీట్లు సాధించిపెట్టేలా చూస్తున్నా ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీకి దక్కడం లేదు.