Published 29 Jan 2024
కార్పొరేషన్ వ్యవస్థ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారినా.. ఇప్పటికీ కనిపించని భరోసాతో RTC ఉద్యోగుల్లో అంతర్లీనం(Internal)గా ఆందోళన కనపడుతూనే ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఈ సర్కారు ఇప్పుడే సర్దుకుంటూ సాగుతుండటంతో పూర్తి అయోమయ పరిస్థితుల్లో చిక్కుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు(RTC Employees). ఇలాంటి అసందిగ్ధ పరిస్థితుల్లోనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈనెల 31 నాడు గుడ్ న్యూస్ వింటారని చెప్పడంతో అది ఏమై ఉంటుందనే కుతూహలం అందరిలోనూ కనిపిస్తున్నది.
‘కోడ్’ లోపలే పరిష్కారం కావాలె…
త్వరలోనే లోక్ సభ ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా ఆ లోపలే తమ సమస్యలు పరిష్కారం కావాలని RTC ఉద్యోగులు కోరుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గ(Cabinet) సమావేశానికి సమయం దగ్గర పడటంతో ఆ మీటింగ్ లోనే RTC అజెండాను ప్రవేశపెట్టాలంటున్నారు ఉద్యోగులు. 2017 ఏప్రిల్ నుంచి వేతన సవరణ జరగకపోవడం వల్ల 54,000 మంది ఉద్యోగులు బేసిక్, DA, ఫిట్ మెంట్ ను కోల్పోయినట్లు RTC బోర్డు మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వర్ రావు అంటున్నారు. ఇప్పటికీ సంస్థలో 43,000 మంది ఉద్యోగులే అని చెబుతున్నారని, కానీ పాత లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే అది 54,000 ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఇక PF(Provident Fund) బకాయిలు రూ.1,400 కోట్లు, CCS నిధులు రూ.1,200 కోట్లు, SRBC, SBTకి సంబంధించి రూ.700 కోట్లు తక్షణమే చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే…
- బాండ్ రూపంలో ఉన్న 2013 వేతన సవరణ బకాయిల చెల్లింపు.
- 2013 పే రివిజన్ అగ్రిమెంట్ ప్రకారం 2015 నుంచి ఎరియర్స్ నిధులు రూ.280 కోట్లు చెల్లించాలి.
- 13 ఏళ్లుగా రిఫండ్ చేయకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన కనిపిస్తున్నది.
- 2015 నుంచి 5 ఏళ్ల కాలానికి 9 శాతం వడ్డీతో ఇస్తామని చెప్పిన గడువు 2020కి ముగిసినా నిధులు రాలేదు.
- 2019 జులై 1 నుంచి పెండింగ్ లో పడిపోయిన DA బకాయిలు చెల్లించడం.
- 10 సంవత్సరాల లీవ్ ఎన్ క్యాష్ మెంట్ వేతనాన్ని ఇవ్వడం.
- పదవీ విరమణ చేసిన కార్మికులకు లీవ్ శాలరీ అందివ్వడం.
- మృతిచెందిన 1100 మంది కార్మికుల కుటుంబాల్ని ఆదుకోవడం.
- 2017 ఏప్రిల్ నుంచి వేతన సవరణ జరగలేదు…
- 2021 ఏప్రిల్ నుంచి మళ్లీ వేతన సవరణ చేపట్టాల్సి ఉంది.
- రెండు పే స్కేల్స్ బాకీ ఉండటం వల్ల రూ.5,000 కోట్ల మేర చెల్లింపులు జరగలేదు.
*ఈ రెండింటి వేతన సవరణకు సంబంధించి ఆర్థిక చెల్లింపులు ఇవ్వాలి. - పీఎఫ్, సీసీఎస్, SRBC, SBTకి సంబంధించి కార్మికులు జమ చేసుకున్న మొత్తం రూ.3,300 కోట్లు రావాల్సి ఉంది.