రానున్న లోక్ సభ ఎన్నికల్లో(Loksabha Elections) అత్యధిక సీట్లు సాధించాలన్న లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ(BJP) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగానే రాష్ట్రవ్యాప్త యాత్రలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు 17 నియోజకవర్గాలను విడతల వారీగా చుట్టివచ్చేలా ప్లాన్ రెడీ చేసింది. ఈ బస్సు యాత్రలు ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే నెల 20 వరకు మొత్తం 11 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని డిసైడ్ అయింది. ప్రజలను కలుసుకునేందుకు సభలు, రోడ్ షో(Road Show)లు, కార్నర్ మీటింగ్(Corner Meeting)లు ఉండనున్నాయి.
పుణ్యక్షేత్రం లేదా మెయిన్ సెంటర్
ఈ బస్సు యాత్రల్ని క్లస్టర్ల వేదికగా ప్రారంభించబోతున్న కమలం పార్టీ.. వాటిని పుణ్యక్షేత్రాలు(Temples) లేదంటే ప్రధాన కేంద్రాలు(Main Centres) ఉండేలా చూసుకుంటోంది. ఉదాహరణకు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన యాత్ర యాదగిరిగుట్ట నుంచి ప్రారంభిస్తారు. ఇలా ప్రతి క్లస్టర్ లోనూ ఇదే విధానాన్ని పాటించాలన్న నిర్ణయానికి రాష్ట్ర నాయకత్వం వచ్చింది. ఇందుకోసం నాలుగు క్లస్టర్లను తయారు చేయగా.. ఆదిలాబాద్, జహీరాబాద్, భువనగిరి, మల్కాజిగిరి అందులో ఉన్నాయి.
అత్యధిక సీట్లపైనే…
కేంద్రంలో మోదీ సర్కారుపై పాజిటివ్ దృక్పథం కనపడుతుందని భావిస్తున్న BJP.. తెలంగాణలోనూ ఈసారి అత్యధిక సీట్లు సాధించాలన్న నిర్ణయానికి వచ్చింది. పరిస్థితులు అదుపు తప్పడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకపడ్డాం కానీ.. సరైన లీడర్ షిప్ ఉంటే మరిన్ని సీట్లు వచ్చేవి అన్న భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. అసెంబ్లీ ఎలక్షన్లకు భిన్నంగా చూస్తున్న లోక్ సభ ఎన్నికల్లో తమకు తిరుగు ఉండబోదని భావిస్తున్న కమలం నాయకులు, కార్యకర్తలు.. ఇక తిరుగులేని రీతిలో సీట్లు సాధించాలన్న లక్ష్యం దిశగా సాగుతున్నారు.