Pic By: The times of India
జవాన్లు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ బలగాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్(Central Reserved Police Force) జవాన్లు ప్రాణాలు కోల్పోగా… మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్ గఢ్ బస్తర్ రీజియన్ లోని సుక్మా-బీజాపూర్ జిల్లాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్ లో రాయ్ పూర్ తరలించి చికిత్స(Treatment) అందిస్తున్నారు. జాగర్ గుండా కొండల్లోని టేకులగూడెం గ్రామం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంపుపై మావోయిస్టులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.
మావోయిస్టుల ప్రాబల్యం కలిగిన టేకులగూడెంలో వారి ఏరివేతకు కోబ్రా(CoBRA) కమాండో(Commandos)లను రంగంలోకి దింపుతూ ఈ మధ్యనే క్యాంప్ బేస్ ఏర్పాటు చేశారు. CRPFకు చెందిన కోబ్రా ఎలైట్ యూనిట్, స్పెషల్ టాస్క్ ఫోర్స్(STF), డిస్ట్రిక్ట్స్ రిజర్వ్ గార్డ్స్ కలిసి జోనగూడ-అలిగూడ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో.. మాటు వేసిన మావోయిస్టులు ఒక్కసారిగా బలగాలపైకి కాల్పులు జరిపారు. మావోయిస్టులు తుపాకులతోపాటు IED పేల్చినట్లు అధికారులు చెబుతున్నారు. గాయపడ్డ 14 మందిలో ఒకరికి బుల్లెట్లు చొచ్చుకుపోగా, మిగతా 13 మంది IED పేలుడు బారిన పడ్డారు.
మావోయిస్టులకు కీలక స్థావరంగా భావించే టేకులగూడెం వద్ద 2021లో జరిగిన దాడిలో 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోతే.. మరో 33 మంది గాయపడ్డారు. ఈ దాడి అప్పట్లో సంచలనమైంది.
Published 30 Jan 2024