పదవీకాలం పెంపు విషయంలో గ్రామ సర్పంచుల(Sarpanches)కు వింత అనుభవం ఎదురైంది. తమ పదవీకాలాన్ని(Tenure) పొడిగించాలన్న పిటిషన్లను విచారించిన హైకోర్టు(High Court) అందుకు నిరాకరించింది. సర్పంచుల పదవీకాలం ఈ నెల 31(నేటితో) ముగియడంతో ఎన్నికలు జరిగే వరకు తమను కంటిన్యూ చేయించాలంటూ గ్రామ ప్రజాప్రతినిధులంతా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనుకున్న టైమ్ లో ఎలక్షన్లు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూనే అప్పటివరకు ప్రత్యేకాధికారుల(Special Officers) పాలన లేకుండా చూడాలని కోరారు.
ఆదేశాలకు నిరాకరణ…
ప్రత్యేక అధికారులను నియమించకుండా ఆదేశాలివ్వాలన్న సర్పంచుల తరఫు న్యాయవాదుల కోరికను కోర్టు తోసిపుచ్చింది. స్పెషల్ ఆఫీసర్ల నియామకాలపై స్టే విధించాలన్న వాదనలను నిరాకరించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక గ్రామాల్లో ప్రత్యేకాధికారుల నియామకానికి ప్రభుత్వం చేస్తున్న కసరత్తుకు బలం లభించినట్లయింది. గెజిటెడ్ అధికారులనే స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను ఇదివరకే ఇచ్చింది.