అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష BRS మధ్య రాజకీయ రగడ(Political Heat) రగులుతున్న వేళ.. విపక్షానికి చెందిన MLAలు ముఖ్యమంత్రి రేవంత్ ను కలవడంపై పెద్దయెత్తున విమర్శలు వస్తున్నాయి. తమ MLAలపై అధికార పార్టీ కన్నేసిందా అన్న అనుమానంతో BRS పార్టీ ఎప్పటికప్పుడు వివరాలు సేకరించే పనిలోనే ఉంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే నలుగురు శాసనసభ్యులు CMను కలవడంపై రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగడంతో కేసీఆర్ స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నలుగురే కాకుండా కొంతమంది సింగిల్ గా వెళ్లి రేవంత్ ను కలుస్తున్నారు.
కేసీఆర్ రాకతో…
తుంటి ఎముక సర్జరీతో ఇంచుమించు రెండు నెలల పాటు ప్రమాణ స్వీకారానికి(Oath) దూరంగా ఉన్న కేసీఆర్.. ఎట్టకేలకు ఆ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేశారు. అనంతరం పార్టీ MLAలు, MLCలతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిని కలుసుకునేవారు ముందుగా పార్టీకి సమాచారం ఇవ్వాలని పార్టీ అగ్రనేత స్పష్టం చేశారు. ఓటమితో నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్న కేసీఆర్.. ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహిద్దామన్నారు.
కాంగ్రెస్ సర్కారు ఉంటుందా..
కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, ఉండదా అన్నది అధికార పార్టీ చేతుల్లోనే ఉందని KCR అన్నారు. ఇచ్చిన హామీల్ని అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చురకలంటించారు. లోక్ సభ ఎన్నికలకు అందరితో చర్చించాకే అభ్యర్థుల్ని ప్రకటిస్తానని ఈ మాజీ CM భరోసా ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలన్న కేసీఆర్.. కాంగ్రెస్ నేతల ట్రాప్ లో పడొద్దని హెచ్చరించారు. మంచి ఉద్దేశంతో సీఎంను కలిసినా మీ క్యారెక్టర్ బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని గుర్తు చేశారు. నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలన్న కేసీఆర్.. అది కూడా ప్రజల సమక్షంలోనే జరగాలన్నారు.
Published 01 Feb 2024