టెస్లా ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోను చూశారా?
అచ్చం మనిషిలాగా భలే నడుస్తుంది కదా..!
humanoid robot walking : టెస్లా ఆప్టిమస్(Tesla Optimus) రోబో కొత్త వీడియో చూశారా? ఈ వీడియోలో హ్యూమనాయిడ్ రోబో చాలా కూల్‌గా కనిపిస్తోంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) మరో వీడియోను తన ‘ఎక్స్’ అకౌంట్లో షేర్ చేశారు. ఇందులో రోబో అచ్చం మనిషిలానే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రోబో నడుస్తున్న తీరు అద్భుతంగా ఉంది. మనిషిలానే పనులను చేస్తుంది. మొదటిసారి ఆప్టిమస్ని చూసిన డెమో కన్నా ఇది చాలా వేగంగా నడుస్తోంది. రోబో ప్రతి కదలికలో కొంచెం గందరగోళంగా ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఆప్టిమస్ రోబో నడక(Walk) చాలా సహజంగా ఉంది. నిజానికి, మొదటిసారి వీడియోను చూసినప్పుడు ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబో ఎవరికి తెలియకుండా దొంగచాటుగా నడవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిలా ఉందని అనుకున్నానని ఎలాన్ మస్క్ అన్నారు. ఈ రోబోతో పాటు త్వరలోనే తాను కూడా వాక్ చేస్తానని చెప్పుకొచ్చారు.
బట్టలను చక్కగా మడతబెట్టిన రోబో :
గత జనవరిలో మస్క్ షేర్ చేసిన ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోలో ఇది రెండో వీడియో. గత వీడియోలో రోబో కొత్త నైపుణ్యాన్ని పొందింది. ఈ రోబో చొక్కాను అదే మడతబెట్టేస్తుంది.. మస్క్ షేర్ చేసిన వీడియోలో ఆప్టిమస్ రోబో టేబుల్ పక్కన ఉన్న బుట్టలో నుంచి నల్ల చొక్కాని బయటకు తీసింది. ఆ చొక్కాను చక్కగా మడతబెట్టినట్టుగా చూడవచ్చు. ఈ వీడియోకు ‘ఆప్టిమస్ ఫోల్డ్స్ ఎ షర్ట్’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఎలాన్ మస్క్ ప్రకారం.. Optimus రోబో ఇప్పటికీ స్వతంత్రంగా అన్ని పనులు పూర్తిచేయగలిగేలా ట్రైనింగ్ ఇవ్వలేదని చెప్పారు. అయినప్పటికీ, టెస్లాలోని ఇంజనీర్లు అది చివరికి పూర్తి స్వయంప్రతిపత్తిని సాధిస్తుందని, వివిధ సెట్టింగ్‌లలో పని చేసేందుకు వీలు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మనిషిని పోలిన టెస్లా బాట్ :
ఎలాన్ మస్క్ షేర్ చేసిన ఈ వీడియోల సిరీస్ అద్భుతంగా ఉంది. అయితే ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసిన ఇంజనీర్లు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. చూసేందుకు మనిషి మాదిరిగానే చురుకుగా పనిచేస్తుందని అంటున్నారు. టెస్లా రోబో నడకలో వేగం పెరగడంతో పాటు మెరుగైన చేతి సంజ్ఞలు, వేళ్లపై స్పర్శ సెన్సింగ్ సామర్థ్యాలు, ఇతర అప్గ్రేడ్ల శ్రేణిని కలిగి ఉంది. 2021లో టెస్లా ఏఐ(Artificial Intelligence)డే ఈవెంట్లో ఈ రోబోను ఆవిష్కరించింది. మానవరూప రోబోను టెస్లా ఆప్టిమస్ లేదా టెస్లా బాట్ అని పిలుస్తారు.
2021లో జరిగిన టెస్లా ఏఐ డే ఈవెంట్లో టెస్లా ఆప్టిమస్ లేదా టెస్లా బాట్ అని పిలిచే హ్యూమనాయిడ్ రోబోను మస్క్ మొదటిసారి ప్రదర్శించారు. రోబో చాలా కూల్‌గా కనిపించింది. ఇది కేవలం సాధారణ-ప్రయోజనం మాత్రమే. నడక, మాట్లాడటం, డ్యాన్స్ వంటి ప్రాథమిక పనులను చేయగలదు. ఒక ఏడాది తర్వాత 2022లో, టెస్లా నడవగల సామర్థ్యం, వస్తువులను తిరిగి పొందడం వంటి ప్రాథమిక పనులను చేయగల ఒక రోబోనూ ఆవిష్కరించింది. లైవ్ ప్రెజెంటేషన్ సందర్భంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ టెథర్ లేకుండా పనిచేసే రోబోను మొదటిసారిగా ప్రదర్శించారు.
ఈ రోబో మొక్కలకు కూడా నీరు పోయగలదు :
నైపుణ్యంతో వస్తువులను తీయడం, మొక్కలకు నీరు పోయడం వంటి వాటిని టెస్లా రోబో ప్రదర్శించాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పూర్తి భద్రతా జాగ్రత్తలను తీసుకున్నట్టు మస్క్ చెప్పారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా లేదా పడిపోకుండా చర్యలు తీసుకున్నామని ధృవీకరించారు. 2023 డిసెంబర్లో Optimus Gen 2 రోబోని ఆవిష్కరించగా.. ఇప్పుడు అనేక మార్పులతో ఈ రోబో మెరుగ్గా కనిపిస్తోంది. హ్యూమనాయిడ్ రోబో ఇప్పుడు వేగంగా పనిచేయగలదు. నడకలో వేగం కూడా పెరిగింది. చేతులను కదపడం, వేళ్లపై స్పర్శ సెన్సింగ్ సామర్థ్యాలు, ఇతర అప్గ్రేడ్లతో అచ్చం మనిషిలానే స్పందిస్తోంది.