ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు(Second Test) తొలి ఇన్నింగ్స్ లో టీమ్ఇండియా(Team India) ఆధిక్యం సాధించింది. విశాఖలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రెండో రోజు యశస్వి జైస్వాల్(209) డబుల్ సెంచరీ అండతో భారత జట్టు 396 పరుగులకు ఆలౌట్ అయింది. జైస్వాల్ తర్వాత రెండో అత్యధిక స్కోరు గిల్(34)దే. కుల్దీప్(8 నాటౌట్), బుమ్రా(6) చేస్తే.. తొమ్మిదో వికెట్ గా యశస్వి వెనుదిరగడం, ఆ వెంటనే ముకేశ్ కుమార్(0) డకౌట్ కావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, బషీర్, రెహాన్ అహ్మద్ మూడేసి చొప్పున వికెట్లు తీసుకోగా మరో వికెట్ హార్ట్ లీకి దక్కింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లిష్ జట్టు.. 253 పరుగులకే ఆలౌట్ అయి 143 రన్స్ ఆధిక్యాన్ని టీమ్ఇండియాకు అందించింది.
క్రాలీ దంచికొట్టినా…
పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దెబ్బకు తక్కువ స్కోరుకే వికెట్లను ఇంగ్లండ్ చేజార్చుకుంది. ఓపెనర్ జాక్ క్రాలీ(76; 78 బంతుల్లో, 11×4, 2×6) వన్డే లెవెల్లో ఆడటంతో స్కోరు బోర్డు స్పీడ్ గా సాగిపోయింది. తొలి వికెట్ గా ఓపెనర్ బెన్ డకెట్(21)ను కుల్దీప్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ వికెట్ల ఖాతా మొదలైంది. దూకుడు మీదున్న క్రాలీని అక్షర్ పటేల్ ఔట్ చేస్తే.. జో రూట్(5), ఒలీ పోప్(23), బెయిర్ స్టో(25)ను బుమ్రా వెనక్కు పంపాడు. బెన్ ఫోక్స్(6), రెహాన్(6)ను కుల్దీప్ ఔట్ చేశాడు. ఇలా 182 స్కోరుకే 7 వికెట్లు కోల్పోయిన టీమ్ ను కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఎనిమిదో వికెట్ గా స్టోక్స్(47)ను బుమ్రా బౌల్డ్ చేశాడు.
రివర్స్ స్వింగ్ తో మాయ…
జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్ కు స్టోక్స్ సేన వద్ద సమాధానమే లేకుండా పోయింది. రివర్స్ స్వింగ్ బాల్స్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ఆటాడుకున్నాడు. చక్కటి స్వింగర్ తో ఒలీ పోప్ ను బోల్తా కొట్టించిన బుమ్రా… మరో సూపర్ బాల్ తో స్టోక్స్ ను బెంబేలెత్తించాడు. ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బాల్ స్వింగ్ అయి వికెట్లను హిట్టింగ్ చేయడంతో.. స్టోక్స్ బ్యాట్ వదిలేసి ఏం చేసినా తప్పించుకోలేకపోయా అన్న రీతిలో రెండు చేతుల్ని పైకెత్తి నిస్సహాయంగా చూశాడు. అనంతరం టామ్ హార్ట్ లీ(21)ని సైతం ఔట్ చేయగా తన అకౌంట్ లో మొత్తం 6 వికెట్లను వేసుకున్నాడు.
మొత్తంగా 171…
రెండో రోజు ఆట ఎండ్ అయ్యే సమయానికి భారత్.. 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన రోహిత్ సేన.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఆడిన 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 రన్స్ చేసింది. జైస్వాల్(15 నాటౌట్), రోహిత్(13 నాటౌట్) క్రీజులో ఉన్నారు. రెండో రోజు(Second Day) ఆటను శాసించిన ఈ యువ ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్ లోనూ కంటిన్యూగా మూడు ఫోర్లు బాదాడు. బషీర్ బౌలింగ్ లో చివరి మూడు బంతుల్ని బౌండరీ దాటించాడు.
Published 03 Feb 2024