సొంతగడ్డపైనే బ్యాటింగ్ చేయలేక అతికొద్ది తేడాతో పరాజయం పాలై విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు(TeamIndia).. ఎట్టకేలకు ప్రత్యర్థిపై తొందరగానే ప్రతీకారం(Revenge) తీర్చుకుంది. ఇంగ్లండ్ తో విశాఖలో జరుగుతున్న రెండో టెస్టును కైవసం చేసుకుని 5 మ్యాచ్ ల సిరీస్ లో 1-1తో నిలిచింది. 67/1తో నాలుగోరోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లండ్… వెంటవెంటనే కీలక వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. మూడో రోజు గిల్(104; 147 బంతుల్లో 11×4, 2×6) సెంచరీతో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 255 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులు చేస్తే.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లిష్ జట్టు 253 రన్స్ కు చాప చుట్టేసింది. 399 లక్ష్యంతో బరిలోకి దిగిన స్టోక్స్ సేన… ముందునుంచీ తడబడుతూనే ఇన్నింగ్స్ కొనసాగించింది. చివరకు 292 రన్స్ కు ఆలౌట్ కావడంతో 106 పరుగుల తేడాతో భారత్ విజయం ఖాయమైంది.
ఒక్కడు మినహా అంతా…
ఓపెనర్ జాక్ క్రాలీ(73) మినహా ఇంగ్లండ్ టీమ్(England Team) లో ఎవరూ పెద్దగా రాణించలేదు. మరో ఓపెనర్ బెన్ డకెట్(28), రెహాన్ అహ్మద్(23), తొలి టెస్టు సెంచరీ హీరో ఒలీ పోప్(23), జో రూట్(16), జానీ బెయిర్ స్టో(26), బెన్ స్టోక్స్(11) వికెట్లు సమర్పించుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లతో బుమ్రా మాయ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో అశ్విన్… ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. కీలక డకెట్, పోప్, రూట్ వికెట్లు తీసుకుని ప్రత్యర్థిని కోలుకోకుండా చేశాడు. కుదురుకుంటాడనుకున్న కెప్టెన్ స్టోక్స్.. అయ్యర్ అద్భుత త్రోకు వెనుదిరగక తప్పలేదు. అశ్విన్ వేసిన బంతిని బెన్ ఫోక్స్ ఆడితే అది ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని లెగ్ సైడ్ వెళ్లింది. అవతలి ఎండ్ లో ఉన్న స్టోక్స్.. క్రీజు లైన్ పై బ్యాట్ ఉంచే లోపే శ్రేయస్ అద్భుతమైన త్రో తో వికెట్లను కొట్టేశాడు.
ఇద్దరికి మూడేసి…
చివర్లో బెన్ ఫోక్స్(36), టామ్ హార్ట్ లీ(36) బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ భారత్ విజయాన్ని ఆలస్యం చేశారు. తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే టెయిలెండ్ వికెట్లు తీసుకోవడంలో బుమ్రా మరోసారి మ్యాజిక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ 3, బుమ్రా 3, ముకేశ్, కుల్దీప్, అక్షర్ ముగ్గురూ చెరో వికెట్ చొప్పున తీసుకున్నారు. మొత్తంగా ఈ రెండో టెస్టులో బుమ్రా 9 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
Published 05 Feb 2024