సొంతగడ్డపై జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్(New Zealand)… బ్యాటింగ్ లో వీర ప్రతాపం చూపించింది. మిడిలార్డర్ బ్యాటర్, యువ సంచలనం(Sensation) రచిన్ రవీంద్ర(240; 366 బంతుల్లో 26×4, 3×6) దక్షిణాఫ్రికా(South Africa) బౌలర్లను ఆటాడుకున్నాడు. మౌంట్ మాంగనూయి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో రెండో రోజు 258/2తో బ్యాటింగ్ కంటిన్యూ చేసిన కివీస్… రవీంద్ర, కేన్ విలియమ్సన్(118; 289 బంతుల్లో 16×4) సెంచరీలతో క్రీజులో పాతుకుపోయారు. ఈ ఇద్దరి వీరవిహారంతో ఆతిథ్య జట్టు 511 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో కెప్టెన్ నీల్ బ్రాండ్ 6 వికెట్లు తీసుకున్నాడు.
74కే నాలుగు…
కివీస్ భారీ స్కోరుకు దీటుగా బ్యాటింగ్ చేపట్టాల్సిన సౌతాఫ్రికా.. 74 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఎడ్వర్డ్ మూర్(23), నీల్ బ్రాండ్(4), రేనార్డ్ వాన్ డెర్(0), జుబేర్ హమ్జా(22) వికెట్లు కోల్పోయింది. నాలుగు ప్రధాన వికెట్లు(Main Wickets) తక్కువ స్కోరుకే కోల్పోవడంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. రెండో రోజు(Second Day) ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 80 రన్స్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమిల్సన్ రెండు.. మ్యాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.
Published 05 Feb 2024