అండర్-19 ప్రపంచకప్ లో భారత కుర్రాళ్ల విజయయాత్ర కొనసాగుతూనే ఉంది. బెనోని స్టేడియంలో దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన మ్యాచ్ లో యువ టీమ్ఇండియా అద్భుత విజయాన్ని అందుకుంది. సెమీఫైనల్ లో అద్భుత విజయంతో తుది పోరు(Final)లో అడుగుపెట్టింది. 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బెదరక.. కప్పుకు మరో అడుగు దూరంలో నిలిచేలా ఆడారు. టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన భారత్… సౌతాఫ్రికాను 7 వికెట్లకు 244 పరుగుల వద్ద కట్టడి చేసింది. రాజ్ లింబాని 3, ముషీర్ ఖాన్ రెండు వికెట్లు తీసుకోవడంతో సఫారీ జట్టు… సాధారణ స్కోరుకే పరిమితమైంది.
రాణించిన ఆ ఇద్దరు…
అనంతరం 245 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్… 8 వికెట్లకు 248 పరుగులు చేసి 2 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. సచిన్ ధాస్(96) కొద్దిలో సెంచరీ మిస్ కాగా.. కెప్టెన్ ఉదయ్ సహరణ్(81) జట్టును గెలుపు దిశగా నడిపించారు. భారత్ ఖాతా తెరవకుండానే ఒక వికెట్ 32కే నాలుగు వికెట్లు కోల్పోయిన దశ నుంచి.. జట్టును గెలుపు తీరాలకు తీసుకెళ్లేవరకు విశ్రమించలేదు. ఈ ఇద్దరు మినహా టీమ్ ఇండియాలో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. చివర్లో కొద్దిగా ఉత్కంఠ ఏర్పడినా భారత కుర్రాళ్లు అనుకున్న లక్ష్యం దిశగా సాగారు.
Published 06 Feb 2024