దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(Uniform Civil Code) తీసుకువచ్చే దిశగా బీజేపీ పాలిత రాష్ట్రాలు(States) ఆలోచన చేస్తున్నాయి. ఈ బిల్లును శాసనసభ(Assembly) సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలన్న దిశగా అడుగులు వేస్తున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే బిల్లును ప్రవేశపెట్టగా.. ఇప్పుడు మరో రాష్ట్రం సైతం నేనూ రెడీ అంటున్నది. కొంతకాలం క్రితమే కొలువుదీరిన రాజస్థాన్ సర్కారు… UCC బిల్లుకు సై అంటున్నది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి కన్హయ్య లాల్ తెలిపారు.
ఇప్పుడే… లేదంటే నెక్స్ట్
యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు రాజస్థాన్(Rajasthan) ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీలైతే ఈ బడ్జెట్(Budget) సెషన్ లోనే.. అది కుదరకపోతే వచ్చే సమావేశాల్లో ఈ బిల్లును తీసుకురావాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. నిజానికి UCC బిల్లును ఇప్పుడు ప్రవేశపెట్టినా చర్చకు టైమ్ పట్టనుంది. ఇప్పటికే కొన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నందున వాటిని క్లియర్ చేసేందుకు గాను UCC బిల్లును అసెంబ్లీ వెబ్ సైట్ లో లిస్టింగ్ చేయలేకపోయారు. కాబట్టి ఈ సెషన్ లో ఇది సాధ్యం కాకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వివాహం, విడాకులు, వారసత్వ ఆస్తికి సంబంధించిన అంశాల్ని ఇందులో చేరుస్తున్నారు. రాజస్థాన్ లో ఈ మధ్యనే BJP ప్రభుత్వం కొలువుదీరగా… వసుంధర వంటి సీనియర్లను కాదని పార్టీ విధేయుడు భజన్ లాల్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ లో ఈ UCC బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
దేశంలోనూ అమలు దిశగా…
కేవలం తమ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ UCC బిల్లును అమలు చేయాలన్న లక్ష్యంగా రాజస్థాన్ సర్కారు ముందుకు సాగుతున్నది. ఈ బిల్లు వల్ల రాజస్థాన్ లోని గిరిజన తెగలకు, పాఠశాలల్లో హిజాబ్ ధారణకు ఒక ముందడుగుగా ఉంటుందని మరో మంత్రి కిరోరి లాల్ మీనా అంటున్నారు. అయితే ఈ బిల్లు విషయంలో ఉత్తరాఖండ్ తరహాలోనే ముందుకు వెళ్లాలని భజన్ లాల్ సర్కారు నిర్ణయించింది. దీనిపై ఆయా వర్గాలతో సంప్రదింపులు కానీ, విపక్షాలతో భేటీలు కానీ నిర్వహించే ఆలోచనలో రాజస్థాన్ సర్కారు లేదన్నది అక్కడి వాతావరణాన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది.